మా డిమాండ్ ప్రత్యేక రాష్ట్రమే
-తెలంగాణపై తేల్చేదాకా సమ్మె ఆగదు
-చర్చలకు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం... తెలంగాణపైనే మాట్లాడుతాం
-ప్రభుత్వానికి తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాల జేఏసీ
-సమ్మె విరమిస్తే విజ్ఞప్తులు పరిశీలిస్తాం:మంత్రివర్గ ఉప సంఘం
-తెలంగాణపై మంత్రివర్గ తీర్మానం అసాధ్యం
-సమ్మె వల్ల తెలంగాణ ప్రజలే ఇబ్బంది పడుతున్నారు: మంత్రి దానం
-చర్చలు మళ్లీ విఫలం!
హైదరాబాద్, అక్టోబర్ 15 : తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. తెలంగాణ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించేదాకా తాము సకలజనుల సమ్మె విరమించబోమని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే తమ ఏకైక డిమాండ్ అని వారు ఢంకాభజాయించారు. చర్చలకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని, తెలంగాణపైనే మాట్లాడుతామని స్పష్టం చేశారు. శనివారం సెక్ర మంత్రివర్గ ఉపసంఘంతో జేఏసీ చర్చలు ప్రారంభం కాగానే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కష్టాలను, నష్టాలను పరిగణనలోకి తీసుకొని సమ్మె విరమించాలని కోరారు. త్వరలో కేంద్రం నుంచి తెలంగాణ విషయంలో ప్రకటన వస్తుందన్న ఆశాభావంతో తాము ఉన్నామని, ఈ ఆశాజనక పరిస్థితుల్లో కూడా సమ్మె కొనసాగించడం సమంజసంకాదని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మె విరమించినట్లయితే ఉద్యోగసంఘాల జేఏసీ విజ్ఞాపనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం తరఫున ఉప ముఖ్యమంవూతితో పాటు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, ధర్మాన ప్రసాదరావు, రఘువీరాడ్డి, ముఖేష్‌గౌడ్, దానం నాగేందర్ చర్చల్లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తప్ప మరే అంశం తమకు ప్రధానం కాదని, తెలంగాణపై మంత్రివర్గం తీర్మానం చేయాలని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో గంటసేపు ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. అయినా మంత్రివర్గం తెలంగాణపై ఏమీ తేల్చలేకపోయింది. ఆ అంశం తమ పరిధిలో లేదని పేర్కొంది. దీంతో జేఏసీ నేతలు తెలంగాణపై తేల్చేదాకా సమ్మె ఆగదని మరోమారు చెప్పి బయటకు వచ్చేశారు. చర్చల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున చైర్మన్ స్వామిగౌడ్, నాయకులు దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రకటన చేయాల్సిందే: స్వామిగౌడ్
చర్చల అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కె.స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రోడ్‌మ్యాప్ తప్ప మరే ఇతర అంశాలనూ తాము అంగీకరించడం లేదన్నారు. కేంద్రం నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రకటన వచ్చేవరకు సకలజనుల సమ్మె జరిగితీరుతుందని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా వస్తామని, తెలంగాణ అంశాన్నే మళ్లీమళ్లీ చెబుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ తమ పరిధిలో లేదని చెబుతున్నందున ఆ అంశం ఎవరి దగ్గర తేలుతుందో, వారి నుంచి ప్రకటన వచ్చే విధంగా కృషిచేయాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలతో తమను అణచివేస్తూ, ఎస్మా పరిధిలోకి వివిధ శాఖలను తీసుకువచ్చి చర్చలకు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణపై తేల్చేదాకా సమ్మె విరమించేది లేదని ఉప సంఘానికి చెప్పామన్నారు.
మంత్రి వర్గం తీర్మానం చేయాలి: దేవీవూపసాద్
ఉద్యోగసంఘాల జేఏసీ కో చైర్మన్ జి.దేవీవూపసాద్ మాట్లాడుతూ చర్చలకు పిలిచే సందర్భంలోనైనా ఎస్మా జీవోలను, జీవో 177ను తొలగించకుండా, తెలంగాణ రాష్ట్రం అంశం తమ పరిధిలో లేదని బుకాయిస్తూ నెపాన్ని ఉద్యోగ సంఘాలపైన నెట్టేందుకు సర్కారు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి వర్గం తెలంగాణ కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. స్వామిగౌడ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలను కొందరు గోరంతలు కొండంతలుగా చేసి సమ్మె విరమిస్తున్నట్లుగా దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు. ఈ ప్రచారాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్ని దుష్ర్పచారాలు సాగుతున్నప్పటికీ తెలంగాణపై తేలేదాకా సమ్మె విరమించేది లేదన్నారు. జేఏసీ సెక్రటరీ జనరల్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కొంతమంది సీమాంధ్ర ఐఏఎస్ అధికారులు, సీమాంధ్ర మంత్రులు సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఉద్యోగసంఘాల జేఏసీకి తెలియచేయకుండా తమ శాఖల్లోని ఉద్యోగులతో మాట్లాడి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ సారథ్యంలో సకల జనుల సమ్మె జరగుతున్నందున చర్చలు జేఏసీతో జరపడమే ధర్మసమ్మతమవుతుందని, అందుకని ఆయా శాఖల ఉద్యోగులు కూడా జేఏసీకి తెలియచేయకుండా చర్చల్లో పాల్గొనరాదని ఆయన విజ్ఞప్తిచేశారు. స్వామిగౌడ్ శుక్రవారం కేవలం తెలంగాణ టీడీపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులను ఉద్దేశించి విమర్శలు చేశారని, ఇప్పటికే తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్షికసీ, టీయూఎఫ్, టీపీపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడలేదని సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు. కో చైర్మన్ సి.విఠల్ ప్రసంగిస్తూ సమ్మెను విచ్చిన్నం చేసేందుకు సీమాంధ్ర మంత్రులు, సీమాంధ్ర ఐఏఎస్‌లు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలకు వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మంత్రివర్గ తీర్మానం అసాధ్యం: మంత్రి దానం
తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియచేయడంలో ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు సఫలీకృతులయ్యారని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర మంత్రివర్గ తీర్మానాన్ని డిమాండ్ చేస్తున్నారని, అది అసాధ్యమని పేర్కొన్నారు. మంత్రివర్గంలో వివిధ ప్రాంతాలకు చెందిన మంత్రులు ఉన్నందున ఈ తీర్మానం సాధ్యం కాదన్నారు. జేఏసీ నాయకులతో చర్చల అనంతరం ఆయన మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల తరఫున విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు 33 రోజులుగా చరివూతాత్మకంగా సమ్మె చేస్తున్నారని, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. జేఏసీ నేతల విజ్ఞాపనలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని, వారు కోరినట్లుగా ఎస్మా జీవోలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని, జీవో 177 కోర్టులో ఉన్నందున అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని, చదువులు సాగడం లేదని, పొలాలు ఎండిపోతున్నాయని, సకల జనులు బాధలు పడుతున్నారని, జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారని దానం అన్నారు. ఈ అంశాలన్నింటినీ జేఏసీ నాయకులు పరిగణనలోకి తీసుకొని సమ్మెను విరమించాలని కోరారు. ఉద్యోగులు సమ్మె విరమించినట్లయితే వారి విజ్ఞాపనలను పరిశీలిస్తామని మంత్రి వివరించారు.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
0 comments:
Post a Comment