తెలంగాణపై ముచ్చట్లు
- ప్రణబ్ నివేదికపై చర్చ.. సమ్మె.. నిర్బంధంపై ఆజాద్ వివరణ
- గంటన్నర పైగా కాంగ్రెస్ కోర్ సమావేశం
- ఉద్రిక్త పరిస్థితులను గుర్తించినా నిర్ణయంపై నత్తనడకే
- రేపో మాపో మళ్లీ కోర్ కమిటీ భేటీ.. ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం
- తెలంగాణపై అప్పటికి నిర్ణయానికి వస్తే యూపీఏ పక్షాలతో భేటీ
- అటు తర్వాతే అఖిలపక్ష సమావేశానికి పిలుపు!
- పక్షం రోజుల్లో చర్చల ప్రక్రియ పూర్తి!: కాంగ్రెస్ వర్గాల అంచనా
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (టీన్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తన వైఖరేమిటో ఇంకా తేల్చుకోలేకపోయింది. తెలంగాణ సమస్యను ఒడ్డుకు చేరుస్తుందనుకున్న కీలకమైన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఎప్పటిలాగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుదీర్ఘంగా గంటా నలభై ఐదు నిమిషాల పాటు చర్చించినా సమస్యకు పరిష్కారమార్గాన్ని కనుక్కోలేకపోయింది. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో సబ్ కోర్ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుల అభివూపాయాలను సేకరించి తయారు చేసిన నివేదికపై కోర్ కమిటీ సుదీర్ఘ విశ్లేషణ జరిపినా నిర్ణయంపై మాత్రం ఓ ప్రాథమిక అంచనాకు రాలేకపోయింది. మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సహా ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఏ.కె ఆంటోనీ, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఈ భేటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. తెలంగాణలో నెల రోజులుగా సాగుతున్న సకల జనుల సమ్మె తీవ్రతపై సమావేశం ప్రారంభంలోనే సభ్యులు చర్చించారు. సమ్మె ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా సమ్మె తీవ్రతలో ఇసుమంతైనా తేడా కనిపించడంలేదని వారు నిర్ధారణకు వచ్చారు. దాంతోపాటు సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైనాన్ని ఆజాద్ కోర్ కమిటీ సభ్యుల ముందుంచినట్టు సమాచారం. సకల జనుల సమ్మెపై ప్రభుత్వ అణచివేత ధోరణికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలను అమోదింపజేసుకోవడానికి బుధవారం లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న విషయాన్ని ఆజాద్ ఈ సమావేశం దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. అయితే కోర్ కమిటీ సభ్యులు మాత్రం ఆజాద్ చెప్పింది వినటమే తప్ప పెద్దగా స్పందించింది లేదని సమాచారం. ఇక తెలంగాణ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో ఆజాద్ చర్చలు జరిపి తయారు చేసిన నివేదిక, పదకొండు మంది రాష్ట్ర ప్రముఖుల అభివూపాయాలను క్రోడీకరించి ప్రణబ్ అందించిన నివేదికపై సభ్యులు తర్జనభర్జన పడ్డారు. అయినా తెలంగాణ సమస్యకు ఏ రకంగా సరైన ముగింపు పలకాలన్న దానిపై మాత్రం నిర్దిష్ట నిర్ణయానికి రాలేకపోయారు. కోర్ కమిటీ తీసుకోబోయే నిర్ణయాన్ని పార్టీ అత్యున్నత విధాన కమిటీ సీడబ్ల్యూసీలో అమోదింపజేయాలా లేక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశంలోనే ప్రకటించాలా అన్న సందిగ్ధం కోర్ కమిటీ సభ్యుల్లో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు సీడబ్ల్యూసీ అమోదం లేదని సీమాంధ్ర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్టీ నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ ద్వారా అమోదింపజేస్తేనే మంచిదని మోజారిటీ సభ్యులు భావించినట్లు తెలిసింది.
అప్పుడే తెలంగాణపై పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారని, ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలను కఠినంగా అమలు జరపవచ్చనే అభివూపాయంతోనే వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగని పక్షంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా త్వరితగతిన సమస్య పరిష్కారానికి పార్టీలోని సీనియర్ నాయకులను, ప్రధాన కార్యదర్శులను సంప్రదించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటిద్దామన్న అంశంపై కూడా సభ్యులు చర్చించారు. పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తే, రాష్ట్రంలో పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాతో సభ్యులు ఆ దిశలోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించి రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త స్థితిని అధిగమించి ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని అమోదింపజేయటం ద్వారా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవచ్చని కూడా సభ్యులు భావించినట్లు తెలిసింది. అయితే తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనుకున్న కోర్ కమిటీ ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా పార్టీ వ్యవహారాలపై పట్టున్న సీనియర్ నాయకులను సంప్రదించి ఒకటి రెండు రోజుల్లో మరో సారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఏదేమైనా, తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండబోతున్నదనే విషయంపై ఊహాగానాలకు తావు లేకుండా గోప్యత పాటించాలని సభ్యులు అభివూపాయపడినట్టు తెలిసింది.
అందుకే సమావేశానంతరం ప్రతిసారి విలేకరులతో ముచ్చటించే ఒకరిద్దరు కోర్ కమిటీ సభ్యులు మంగళవారం మాత్రం ఎలాంటి సంకేతాలు అందించలేదు. వచ్చే కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని కోర్ కమిటీ ద్వారా ప్రకటించాలా లేక సీడబ్ల్యూసీ ద్వారా ప్రకటింపజేయాలా అన్న దానిపై స్పష్టత వచ్చాక అఖిలపక్షం ఏర్పాటుపై కూడా కోర్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా తెలంగాణపై పార్టీ వైఖరి వెల్లడైన వెను వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కార బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈలోగా పార్టీ తీసుకున్న నిర్ణయంపై వచ్చేవారం యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా ఒక సమావేశం ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ఆ తర్వాతే ఒకటి రెండు రోజుల వ్యవధిలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోర్ కమిటీ భావిస్తోంది. ఈ మొత్తం సమావేశాల ప్రక్రియను చూస్తే పార్టీ పరంగా గానీ లేక ప్రభుత్వ పరంగా గానీ తెలంగాణ సమస్య పరిష్కారానికి ఓ నిర్దిష్ట నిర్ణయం రావాలంటే ఓ పక్షం రోజులకు మించి పట్టకపోవచ్చని హస్తినలో కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
0 comments:
Post a Comment