ఆ యోచన లేదు రాష్ట్రపతి పాలనపై చిదంబరం స్పష్టీకరణ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదు చర్చల ప్రక్రియ కొనసాగుతోంది: హోంమంత్రి
న్యూఢిల్లీ, జూలై 6 : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే ఆలోచనేదీ లేదని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల రాజీనామాల వ్యవహారాన్ని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించగా... "వారు రాజీనామాలు చేయటం పట్ల మేం కూడా సంతోషంగా లేం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఇతర సహచరులు ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. పరిష్కార మార్గం లభిస్తుందని ఆశిస్తున్నాం'' అని తెలిపారు.
రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి తనను కలవడంలో ప్రత్యేకత ఏదీ లేదని చెప్పారు. "వామపక్ష తీవ్రవాదంపై సోమవారం జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో పాల్గొనేందుకు దినేశ్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే నాతో భేటీ అయ్యారు. ఇదేమీ అసహజ పరిణామం కాదు'' అని చిదంబరం వివరించారు. తెలంగాణలో బంద్, ఉద్యమం జరుగుతున్న సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్త వచ్చనే ఆందోళనతోనే కేంద్ర బలగాలను పంపించామని తెలిపారు.
"ఉద్యమానికి కారణమేమిటో మేం అర్థం చేసుకోగలం. అదే సమయంలో... ఆందోళన కారులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోరని కూడా విశ్వస్తున్నాం'' అని తెలిపారు. బంద్ సందర్భంగా కూడా చిన్న చిన్న సంఘటనలు మాత్రమే చోటుచేసుకున్నాయని, పెద్ద సంఘటనలేమీ జరగలేదని చిదంబరం చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆరో సిఫారసును అమలు చేసే దిశగా కేంద్రం నడుస్తోందా అని ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు తనకు సమాధానం తెలియదని చెప్పారు.
తెలంగాణపై ప్రస్తుతం చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. తెలంగాణలో ఎంఐఎం, సీపీఎం మినహా అన్ని పార్టీలూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించాయని, మెజారిటీ పార్టీలు సానుకూలంగా ఉన్నప్పుడు ఇంకా చర్చలు ఎందుకన్న వాదన ఉంది కదా అనే ప్రశ్నకు ఒకింత అసహనం ప్రదర్శించారు. "ఇది వాదోపవాదాలకు వేదిక కాదు. ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఇప్పటికే చెప్పాను'' అని చిదంబరం బదులిచ్చారు. చర్చల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
0 comments:
Post a Comment