తేల్చే వరకు ఢిల్లీ వదలం
హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ రాష్ట్రం విషయంలో అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయనంత వరకు తాము హైదరాబాద్ వెళ్ళేది లేదని భీష్మించి కూర్చున్నారు. బుధవారం హస్తినలో పార్టీ హైకమాండ్ తాజా వైఖరి చూసిన తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను, గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలని వారు నిర్ణయించు కున్నట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు పార్టీ నాయకత్వం తెలంగాణపై ఒక ప్రకటన చేసే వరకు తాము ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేయడంతో గురు వారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కోర్ కమిటీ సభ్యులు తమకు అపా యిం ట్‌మెంట్ ఇవ్వక పోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. సోమవారంఅహ్మద్ పటేల్‌తో భేటి సందర్భంగా కోర్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తానని అతను తమను నమ్మించి మోసం చేశారని పలువురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎ.కె.ఆంటోనని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ వీరప్ప మొయిలీతో భేటి అయ్యారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో ఈ గోలేంటి అని మొయిలీ ఎమ్మెల్యేలపై ఫైర్ అయినట్లు తెలిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం సరైంది కాదని, తెలంగాణ విషయంలో అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు ఆయన నచ్చజెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాస్త మెత్తబడ్డారు. కాగా ప్రకటన లేకుండా ఒట్టి చేతుల్తో తిరిగి వస్తే తెలంగాణవాదులు, టిఆర్‌ఎస్ వారి నుంచి దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున స్పష్టమైన ప్రకటన చేసే వరకు హైదరాబాద్ వెళ్ళబోమని హస్తినలోనే భీష్మించి కూర్చున్నారు. వారు ఢిల్లీలోనే ఉండటంతో గురువారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను హజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమావేశాలను బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అదే విధంగా మరి కొన్ని రోజుల్లో సమావేశాల్లో టిఆర్‌ఎస్‌తో తెలంగాణ కోసం గొంతు కలపాలనే ఆలోచనతో కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని మన్మోహన్‌సింగ్ తాజాగా బుధవారం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భగ్గుమంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలను ఫూలిష్‌గా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అభివర్ణించారు. డిసెంబర్ 9వ తేదీ ఏకాభిప్రాయం లేకుంటే ఎందుకు ప్రకటన చేశారని, మళ్ళీ ఏకాభిప్రాయం సాధించడం అంటే అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశం అభిప్రాయం, సిఎల్పీ తీర్మానం వచ్చిన తరువాత కూడా ఏకాభిప్రాయం లేదనడంలో అర్ధం లేదని ఆయన ప్రధానిపై చిందులు వేశారు.
ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెలీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లదీసినట్లు సమాచారం. కోర్ కమిటీ సభ్యులతో, సోనియాతో అపాయింట్ మెంట్ ఇప్పించి ప్రకటన చేయించాలని, లేక పోతే ఇక తాము పదవులకు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు తప్పవని వారు జైపాల్‌తో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం నుంచి తగిన స్పందన లేక పోవడంతో ఏం చేయాలో తెలియక, రాష్ట్రానికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో అర్ధం కాక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలపట్టుకుంటున్నారు.
take BY: Suryaa.com
0 comments:
Post a Comment