సహాయం బంద్ గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం
సహాయం బంద్
గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం
చర్యలు తీసుకుంటే ప్రతిఘటిస్తాం
సర్కారుకు హెచ్చరిక
సీమాంధ్ర సిబ్బందీ సహకరించాలి
ఎమ్మెల్యేలు, మంత్రులూ పాల్గొనాలి: స్వామిగౌడ్
ఈగవాలినా ఊరుకోం: కేసీఆర్
సహకరించాలని డీఎస్‌కు జేఏసీ వినతి
సహకరిస్తాం: తెలంగాణ టీడీపీ
ప్రతి పౌరుడూ పాల్గొనాలి: యాష్కీ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఉద్యోగులూ ఉద్యమబాట పట్టారు. తెలంగాణ కోసం రణం తప్పదని తేల్చి చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనన్న డిమాండ్‌తో గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెడుతున్నారు. రాష్ట్ర రాజధాని సహా మొత్తం తెలంగాణ జిల్లాలన్నింటిలోని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కచోటా పనిచేసేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో.. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, మాట తప్పితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని టీఎన్జీవో నేతలు హెచ్చరించారు.
ఉద్యమంపై ప్రభుత్వ స్పందనను బట్టే తమ విధానం కూడా ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో బుధవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, విఠల్, దేవీప్రసాద్, మధుసూదన్‌రెడ్డి కలిశారు. తమ ఉద్యమానికి సహకరించాలని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టించాలని డీఎస్‌ను కోరారు. ఆ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు.
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకం ఉద్యమం చేస్తుంటే.. వారు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకునే తాము మౌనంగా ప్రేక్షకపాత్రలో ఉండలేమని స్వామిగౌడ్ చెప్పారు. తాముకూడా గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. గురువారం నుంచి విధులకు హాజరై ఉద్యోగులు సంతకం చేస్తారే కానీ, విధులు నిర్వహించబోరని స్వామిగౌడ్ ప్రకటించారు.
ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగానే నిరసన తెలియజేస్తామని, వ్యవస్థను కుప్పకూల్చబోమన్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని సీమాంధ్ర ఉద్యోగులను కోరారు. తమ సీట్లలో కూర్చుని పని చేయవద్దని, తమ మనోభావాలను, ప్రయత్నాలను దెబ్బతీయవద్దని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక విలువలు చెడిపోకుండా, వ్యవస్థలు పాడుకాకుండా, పేదలకు నష్టం కలగకుండా తమ నిరసన తెలియజేయాలని డీఎస్ సూచించినట్టు ఆయన చెప్పారు.
'మా నిరసన ప్రజల కోసం. తెలంగాణ యువకులకు ఉద్యోగాల కోసం. మా బతుకుతెరువు, నదులు, నిధుల కోసం. కాబట్టి ఇందులో ప్రజలెవరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్నే ఉండదు' అని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని భావిస్తున్నామని, ప్రభుత్వం దానిని భగ్నం చేస్తే ఉద్యోగుల మధ్య గొడవలు ఆరంభమవుతాయని శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేయాలని, మంత్రులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని విఠల్ కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నేతలు కోరినన్ని రోజులు సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తామని స్వామిగౌడ్ ప్రకటించారు. సహాయ నిరాకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ఉద్యోగులకు సహకరించాలన్నారు.
మరోవైపు.. ఉద్యోగుల ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. సహాయ నిరాకరణలో పాల్గొనే ఉద్యోగులను వేధించినా.. వారిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని, సర్కారును కూల్చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. చీమూ నెత్తురు ఉన్న ప్రతీ తెలంగాణ పౌరుడూ సహాయ నిరాకరణలో పాల్గొనాల్సిందేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
ఉద్యోగులపై కేసులు పెడితే ప్రత్యక్ష పోరుకు దిగుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం నుంచే తమ సహాయ నిరాకరణ మొదలవుతుందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులది ఆషామాషీ నిర్ణయం కాదని, తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని ఉద్యోగులు చేస్తుండడం అద్భుతమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment