సిఎం రచ్చబండను నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ-ధర్నా
వరంగల్ లీగల్ మేజర్ న్యూస్‌ః జిల్లాకు రచ్చబండ కార్యక్రమంలో పేరుతో వస్తున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను నిరసిస్తూ జిల్లా న్యాయవాదులు కోర్టుగేట్లు మూసివేసి గురువారం విధులు బహిష్కరించారు.అనంతరం ధర్నాకు దిగారు. రచ్చబండ వద్దు... తెలంగాణా ముద్దు.. జై తెలంగాణ...జైజై తెలంగాణ... అంటూ నినాదాలు చేసిన వందలాది మంది న్యాయవాదులు కోర్టు ప్రధాన గేట్లు మూసివేసి గేట్ల ముందు బైఠాయించారు. అనంతరం జిల్లా కోర్టు ముందు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు గణేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సిఎం కిరణ్‌కుమార్ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా ఉద్యమం ఆగదని ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. తమకు రచ్చబండ లాంటి జిమ్మిక్కుల కార్యక్రమాలు వద్దని కేవలం తెలంగాణ కావాలన్నారు. ప్రజలు రచ్చబండ వద్దని నిర్వహిస్తున్నా పోలీసు బలగాలతో బలవంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. ఎంతో మంది పోలీసులను పెట్టినా తెలంగాణ వాదులు రచ్చబండను రచ్చచేశారని అన్నారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిల్లా రాజేంద్రప్రసాద్, బార్ కౌన్సిల్ మెంబర్ ఎం. సహోదర్‌రెడ్డి పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మాట్లాడారు.
పోలీసులతో వాగ్వాదం - తోపులాట
సిఎం రాకను నిరసిస్తూ జిల్లా ప్రధాన గేట్లు మూసివేసిన క్రమంలో సుబేదారి సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాదులకు, సిఐకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు గేట్లు తీయాలని సుబేదారి సిఐ అనగా నిరసనలో భాగంగానే గేట్లు మూసి వేసామని న్యాయవాదుల విషయంలో సుబేదారి సిఐ చూపిస్తున్న అత్యుత్సాహం పనికిరాదని నినదించారు. పోలీస్ గోబ్యాక్... ప్రజాస్వామ్య దేశమా... పోలీసుల రాజ్యమా... అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో కోర్టు గేట్లు బలవంతంగా తీయడానికి ప్రయత్నించారు.
కానీ న్యాయవాదులు అడ్డుకొని గేట్ల ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది.వందలాది మంది న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు బలగాలను తీసుకొని వెంటనే వెళ్లి పోవాలని సి వెంకటేశ్వరబాబుపై మండిపడ్డారు. పోలీసుల బలగాల రాకతో రక్షణ వలయంగా ఏర్పడ్డ న్యాయవాదుల ఉదృతికి తగ్గిన పోలీసులు వెనుకడుగు వేశారు. అనంతరం తమ బలగాలను తీసుకొని సిఐ అక్కడి నుండి వెళ్లిపోయారు.
take BY: Suryaa
0 comments:
Post a Comment