ఆఫీస్‌కొచ్చినా పనిచేయరు తెలంగాణ డిమాండ్‌తో 17 నుంచి ఉద్యోగుల ఆందోళన సహాయ నిరాకరణ సన్నాహకంగా నేడు ధర్నా అరెస్టయినా ఆగకుండి రెండంచెల నాయకత్వం ప్రత్నామ్న
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : తెలంగాణలో సమ్మె వాతావరణం అలముకుంటోంది. ఈ నెల 17 నుంచి మొదలయ్యే 'సహాయ నిరాకరణ' ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చినా విధులు నిర్వహించరు. అయితే, ఉద్యమ ప్రభావాన్ని సాధ్యమైన మేర తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వం వివిధ శాఖల అధిపతులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు ఉద్యమ సన్నాహకాల్లో భాగంగా జంట నగరాల్లోని 10 వేల మంది ఉద్యోగులు శుక్రవారం జీహెచ్ఎంసీ వద్ద 'మహాధర్నా' నిర్వహించనున్నారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే 'తెలంగాణ' బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో చేపట్టనున్న ఈ ఆందోళన గురించి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. 'ఒక్క ఫైలు కూడా కదలకూడదు. ప్రభుత్వ సమాచారాలనూ చేరవేసే ప్రసక్తి లేదు. మంత్రుల ప్రోటోకాల్స్, పర్యటనలను పట్టించుకోరాదు' అని ఉద్యోగులకు పిలుపునిచ్చినట్లు జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. సీమాంధ్రకు ఆర్టీసీ బస్సులను నడపవద్దని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చామన్నారు
. ప్రజలు, సీమాంధ్ర ఉద్యోగులు, పార్టీలు తమకు సహకరించాలని వారు విఙ్ఞప్తి చేశారు. అలాగే మంత్రుల, ఉన్నతాధికారుల వాహనాలను నడపరాదని ప్రభుత్వ డ్రైవర్లు నిర్ణయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉపాధ్యాయులు రెండోదశ జనగణనకు వెళ్లిపోవడంతో తరగతులు సరిగా జరగని నేపథ్యంలో మిగిలిన టీచర్లు కూడా విధులకు నిరాకరిస్తే తమ పరిస్థితి ఏమిటని వచ్చేనెలలో పరీక్షలు రాయడం ఎలాగని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.
ఏదేమైనా పారిశుధ్యంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖల్లో అత్యవసర సేవలు మినహా 17 నుంచి పౌర జీవనం స్తంభించనుంది. ఫలితంగా తెలంగాణలో రోజుకు రూ.50 కోట్ల వంతున ప్రభుత్వాదాయం పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగుతున్నందువల్ల మద్యంపై వసూళ్లనూ కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని నివారించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తమను అరెస్టు చేసినా ఉద్యమ ఊపు ఆగకుండా ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలో దిగేలా అగ్రనేతలు వ్యూహం సిద్ధం చేశారు.
take BY: Andhrajyohti
0 comments:
Post a Comment