* వెల్లడికానున్న శ్రీకృష్ణ నివేదిక
* తెరవేస్తారా..? సాగదీస్తారా..? రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్
* శ్రీకృష్ణ నివేదికను అందించటమేనా..? నిర్ణయం తీసుకుంటారా?
* అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ దూరం
* పీఆర్పీ నో కామెంట్.. సీపీఐ తెలంగానం.. సీపీఎం సమైక్య నాదం
* హైదరాబాద్‌పైనే ఎంఐఎం దృష్టి
* కాంగ్రెస్‌లో ప్రత్యేక, సమైక్య వాదనలున్నా.. చివరికి హైకమాండ్ దారే
* అన్నిటికీ మించి కేంద్ర సర్కారు నిర్ణయమే కీలకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఏడాది కాలపు ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలను తీవ్ర ఉత్కంఠలో పెట్టిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.. వారం కిందట కేంద్రానికి సమర్పించిన నివేదికలోని అంశాలు గురువారం వెల్లడికానున్నాయి. ఈ నివేదికపై రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలక సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో జరిగేదేమిటి? అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యం పాటిస్తోంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కీలకమైన నిర్ణయం జరుగుతుందా? లేక కేవలం నివేదికను అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వటం వరకే పరిమితం చేసి.. ఇవే పరిస్థితులు కొనసాగటానికి కారణమవుతారా? అనేది నేటితో తేలిపోనుంది.
రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రాలేమని ప్రకటించాయి. వీటి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉంటానని ప్రకటించింది. తెలంగాణలో కీలకమైన రాజకీయ పార్టీల్లో సగం పార్టీలు తిరస్కరించిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని రాష్టమ్రంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిరర్ధకమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కేంద్ర ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్క ప్రతినిధినే ఆహ్వానించకుండా భిన్నాభిప్రాయాలు వచ్చే విధంగా అనైతిక పద్ధతికి కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహాన్నిస్తోందంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కూడా అఖిలపక్ష ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించినా భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించినట్లు కాదంటూ ఏకాభిప్రాయం ప్రకటించిన పార్టీలను ఉదహరిస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం రెండోసారి కేసీఆర్‌ను ఆహ్వానించారు.
రెండోసారి పంపిన ఆహ్వానాన్ని కూడా కేసీఆర్ తిరస్కరిస్తూ.. అఖిలపక్ష కమిటీ సమావేశానికి రాలేమని ప్రకటించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ఏర్పాటు చేసే అధికారం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నాయని ప్రకటించాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అటూఇటుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లటం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉందని.. ఈ సమావేశానికి తాము రావాల్సినంత అవసరమేమీ లేదనే కారణంతోనే గైర్హాజరవుతున్నామంటూ చంద్రబాబు లేఖ రాశారు.
అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధిగా సి.రామచంద్రయ్య ఒక్కరే హాజరుకానున్నారు. ఈయన కూడా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పకుండా నివేదికను మాత్రమే పార్టీ తరఫున తీసుకోనున్నారు. ఒకవేళ అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరితే పార్టీలో చర్చించిన తర్వాతే పార్టీ వైఖరిని చెప్తామని మరింత గడువు కోరటానికి రామచంద్రయ్య హాజరవుతున్నారు. ఇక సీపీఎం ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి హాజరవుతున్నారు. నివేదిక ఇచ్చినా, అభిప్రాయం అడిగినా సమైక్యవాదాన్నే వీరు వినిపించనున్నారు. సీపీఐ తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు జి.మల్లేష్ హాజరవుతుండగా.. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఏకాభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఎంఐఎం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఎమ్మెల్సీ ఖాద్రీ హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయదలిస్తే హైదరాబాద్, మైనారిటీ అంశాలను వీరు ప్రస్తావించనున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ...
రాష్ట్ర రాజకీయ పార్టీల్లోకెల్లా కాంగ్రెస్‌లోనే తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితి నెలకొనిఉంది. టీడీపీ తర్వాత.. అంతర్గతంగా అదేస్థాయిలో తెలంగాణ, సమైక్యాంధ్ర విషయాల్లో సొంతపార్టీ నేతల మధ్యనే అగాధం నెలకొంది. పుట్టినరోజు నాడే నిర్ణయాన్ని ప్రకటించినందున తెలంగాణకు అనుకూలంగానే పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ ప్రాంత నాయకులు చెప్తున్నారు. రెండో ఎస్‌ఆర్‌సీయే పార్టీ విధానమని, రాష్ట్ర విభజనకు అంగీకరించబోరని సమైక్యవాద నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే పార్టీ పదవులే కాదు ఎలాంటి త్యాగాలనైనా చేస్తామని తెలంగాణ నాయకులు హెచ్చరిస్తుంటే.. రాష్ట్రాన్ని విభజిస్తే రాజకీయాల నుండి నిష్ర్కమిస్తామంటూ సమైక్యవాద నాయకులు బెదిరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి రెండు ప్రాంతాలకు చెందిన ఇద్దరు నేతలు కావూరి, ఉత్తమ్‌లు అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నారు. రాష్ట్రాన్ని విభజించటం అంత ఈజీ కాదని కావూరి అంటే.. తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఉత్తమ్ ఉద్ఘాటించారు. రాష్ట్ర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ వంటివి అంతర్గతంగా నిట్టనిలువునా చీలిపోతున్న ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ దాదాపు 10 నెలల పాటు రాష్ట్రంలో అధ్యయనం చేసింది. కమిటీ చేసిన అధ్యయనం, సూచించిన పరిష్కారాలు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర రాజకీయవర్గాల్లోనే కాకుండా వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులతో పాటు ప్రజానీకమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కమిటీలో ఏయే అంశాలు, పరిష్కారాలు చోటుచేసుకున్నాయనేది ఒక అంశమైతే దీనిపై కేంద్ర వైఖరేమిటన్నదే అన్నింటికన్నా అంతిమ ప్రాధాన్యతాంశం.
Tag: Sakshi, eenadu, News, Telangana, KCR, RajNews, AP,
0 comments:
Post a Comment