రాజుల సొమ్ము..కేసుల పాలు (వారసత్వ పోరులో నలుగుతున్న వేల కోట్ల నిజాం ఆస్తులు)
ఆస్తులపై ఎవరి వాదనలు.. వారివే..
తమకే చెందుతాయంటూ ముందుకొచ్చిన 500 మంది..
ఒకరిపై ఒకరు వ్యాజ్యాలు.. కేసులు..
ముకరం జా ఆస్తుల్లో వాటాల కోసం భార్యా పిల్లల పోటీ
వేల
ఎకరాల్లో భూములు.. ఒక్క హైదరాబాద్‌లోనే 630 ప్యాలెస్‌లు.. దేశంలో అనేక
చోట్ల భవంతులు.. క్వింటాళ్ల కొద్ది వజ్ర, వైఢూ ర్యాలు... ప్రపంచ ధనవంతుల
జాబితాలో ఒకప్పటి నంబర్ వన్, చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల
చిట్టా ఇదీ! హైదరాబాద్ కేంద్రంగా 37 సంవత్సరాల సుదీర్ఘ పాలనతో దక్కన్‌లో
ఆధునికతకు బాటలు వేసి, ఆపరేషన్ పోలోతో భారత సైన్యాలకు తలవంచిన ఈ నిజాంకు
చెందిన అపార సంపద అంతా వివాదాలమయం!!
సాక్షి, హైదరాబాద్: కళ్లు
బైర్లుకమ్మే ఆభరణాలు, ఆస్తులు నిజాం కుటుంబానికే చెందుతాయంటూ భారత
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ 1947, నిజామ్స్
ట్రస్ట్ వాలిడేషన్ యాక్ట్ 1950) నిజాం పరివారంలో వెలుగులు నింపినా..
‘వారసత్వ పోరు’తో అవి కాస్త మసకబారాయి. ఆ ఆస్తులకు వారసులం తామంటే.. తామంటూ
వారసులు అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్
అలీఖాన్(1886-1964) అనంతరం ఆయన కుమారులు ఆజం జా, మోజం జాల తరం వరకు
గుట్టుగా జీవనం సాగించిన నిజాం వారసులు.. ఆస్తుల వివాదంతో మరోసారి
తెరపైకొచ్చారు. ఆజం మొదటి కుమారుడు 8వ నిజాం హైదరాబాద్ ప్రిన్స్ ముకరం జా
(79)... తన భార్యలు, వారి పిల్లలతో ఆస్తి వివాదాల్లో మునిగి తేలుతుండగా..
ఆజం మరో కుమారుడు ముఫకం జా తన తోబుట్టువులు, వారి పిల్లలతో పంచాయతీల్లో
కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉస్మాన్ అలీఖాన్.. ఆయన వారసులు-వివాదాలపై
‘సాక్షి’ ప్రత్యేక కథనం...
హైదరాబాద్ విలీనం సమయంలో ఏం జరిగింది..?
1911 నుండి 1948 వరకు హైదరాబాద్ కేంద్రంగా రాచరిక పాలన చేసిన ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను ఓ స్వతంత్య్ర రాజ్యంగానే ఉండాలని కోరుకున్నారు. కానీ 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత సైన్యాలు చేసిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయక తప్పలేదు. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనానికి ప్రతిఫలంగా అలీఖాన్ భారత ప్రభుత్వంతో ఒప్పందం (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకున్నారు. నిజాంకు చెందిన ఆస్తుల జోలికి వెళ్లమని, తన సొంతమని భావించే ఆస్తులకు సంబంధించి చట్టపరమైన రక్షణలు ఇస్తామని నాడు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
ఇందులో భాగంగానే నిజాం సమర్పించిన తన ప్రైవేటు ఆస్తుల చిట్టా ‘బ్లూ బుక్’ను ఆమోదిస్తూ 1950 జనవరి 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టూరా ఉన్న 23 వేల ఎకరాల (సర్ఫెఖాస్) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, మహేబలేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న 630 భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ వెంకటాచారి ఉత్తర్వులు వెలువరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నుమ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్ విల్లా, ఫెర్న్ విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర , వైఢూర్యాలు నిజాం కుటుంబం సొంతమయ్యాయి. అయితే ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా చేర్చింది. ఫలితంగా 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, నిజాం కుటుంబ సభ్యులతో పాటు మాజీ సివిల్ సర్వీసు అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
వారసులు వచ్చారిలా..
నిజాంకు సంబంధించి దాదాపు 90 శాతం ఆస్తులు న్యాయపరమైన వివాదాల్లో ఉన్నాయి. తాజాగా 8వ నిజాం ముకరం జా (ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఆజం జా మొదటి కొడుకు) మూడో మాజీ భార్య మనోల్యా ఒనూర్, ఆమె కూతురు నీలోఫర్‌లు.. చిరాన్ ప్యాలెస్ తమకే వస్తుందని ప్రకటించారు. మరోవైపు తన వాటా కింద ముఫకం జా ట్రస్ట్ అధీనంలో ఉన్న మౌంట్‌ప్లజెంట్ (ముఫకం జా కాలే జీ) వస్తుందంటూ ముఫకం జా (ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు) కోడలు సఫియా సఖీనా కోర్టును ఆశ్రయించారు. దక్షిణ ముంబై మలబార్‌హిల్స్‌లోని రూ.400 కోట్ల విలువ చేసే 5,000 గజాల స్థలానికి వారసులం తామేనంటూ జమీన్ అలీఖాన్, కుద్రత్, ఫిర్సాత్ అలీఖాన్‌లు ముంబై కలెక్టర్‌కు ఇటీవలే లేఖ రాశారు. ఇందుకు తీవ్ర అభ్యంతరం చెబుతూ 8వ నిజాం ముకరం జా కలెక్టర్‌కు మరో లేఖ సంధించారు. ఇవిగాకుండా నిజాం ప్రైవేటు ఆస్తిగా పేర్కొనే సర్ఫేఖాస్ భూములపై వేల సంఖ్యలో కేసులు సిటీ న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. నిజాం ఆస్తులకు వారసులం తామంటే.. తామని అనేక మంది ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే ముకరం జా కొడుకు అజ్మత్ జా తాజాగా కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. ఆస్తుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏడో నిజాం తర్వాత.. ఎవరికి వారే యమునా తీరే!
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తర్వాత.. నిజాం కుటుంబం ఎవరికి వారే విడిపోయారు. తామే నిజాం వారసులమంటూ ఇప్పటిదాకా ఐదు వంద మందికిపైగా ముందుకు రావడం విశేషం. ఎనిమిదో నిజాంగా ప్రకటించుకున్న ముకరం జా అధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. లండన్ డూన్ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పట్టాలు అందుకున్న ఈ హైదరాబాద్ ప్రిన్స్ విలాసాలకు చిరునామా. ఈయన తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959-75), తర్వాత ఎయిర్ హోస్టెస్ హెలెన్ (1980-90)ను ,ఆపై అప్పటి మిస్ టర్కీ మనోల్యా ఒనోర్‌ను (1990-96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాక్’ చెప్పేశారు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నారు. మొత్తంగా చూస్తే ఈయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు (కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడో భార్య ద్వారా కూతురు (నీలోఫర్), నాలుగో భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు.
ఆస్తుల అన్యాక్రాంతం సరికాదు: న్యాయనిపుణుడు వెంకట రమణ
‘‘రాజభరణాల రద్దు తర్వాత నిజాం కుటుంబానికి ఎలాంటి ప్రత్యేక హోదాలు, హక్కులు లేవు. అయినా వారి పేర్లపై వందల ఎకరాల భూములు, ఆస్తులు, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయి. వారు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తుల అన్యాక్రాంతం చేస్తున్న దృష్ట్యా భారత ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ట్రస్ట్‌ల తీరుపై వెంటనే విచారణ చేపట్టాలి.’’
నిజాం సంతానం ఇదీ...
ఉస్మాన్ అలీఖాన్-దుల్హన్ పాషా దంపతులకు ఇద్దరు కొడుకులు ఆజం జా, మోజం జా, ఓ కూతురు మహ్మద్ ఉన్నీసా బేగం. ఆజంజా టర్కీకి చెందిన దురేషెవార్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ముఖరంజా, ముఫకం జా ఇద్దరు కొడుకులు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బతికి ఉండగానే తన వారసునిగా అంటే 8వ నిజాంగా ముకరం జాను ప్రకటించాడు. మోజం జా తొలుత నీలోఫర్ (టర్కీ)ను పెళి ్లచేసుకున్నాడు. విడాకుల అనంతరం రజియాబేగం, ఆ తర్వాత అన్వర్ బేగంలను పెళ్లాడాడు. వీరిలో ఆయనకు రజియాబేగం ద్వారా ఫాతిమా, అమీనా, ఓలియా కుల్సుం ముగ్గురు కూతుళ్లు కలిగారు. చివరి భార్య అన్వర్ బేగం ద్వారా కొడుకు శ్యామత్ అలీఖాన్ జన్మించాడు.
చిరాన్ ప్యాలెస్ నాకే రావాలి
నాన్నను చూడక రెండేళ్లవుతోంది. కలుసుకునేందుకు ప్రయత్నించినా కొందరు అడ్డుకుంటున్నారు. అందుకే నాన్న (ముకరం జా) ఆస్తిలో వాటా కోసం నేనిప్పుడు అమ్మ ఓనూర్‌తో కలిసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం కొడుకులకు రెండు వంతులు, ఆడ పిల్లకు ఒక వంతు ఆస్తి ఇవ్వాల్సిందే. నాన్నను చూసేందుకు న్యాయ పోరాటం చేస్తా. లెక్క ప్రకారం కేబీఆర్ పార్కు పరిసరాల్లోని చిరాన్ ప్యాలెస్ పూర్తిగా నాకే రావాలి.
- నిలోఫర్ (ముకరం జా మూడో భార్య మనోల్యా ఓనూర్ కూతురు)
లాయిడ్స్ బ్యాంక్‌లో తేలని వివాదం
1947లో ఆపరేషన్ పోలో సమయంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ ద్వారా అప్పట్లో లక్షా ఎనిమిది వేల (ప్రస్తుత విలువ రూ.240 కోట్లు) పౌండ్లను లాయిడ్ బ్యాంక్ ఆఫ్ లండన్‌లో డిపాజిట్ చేయించిన వివాదం ఇంకా సమసిపోనేలేదు. 1947 అనంతంర భారత్, పాకిస్థాన్ విడిపోవటం, లాయఖ్ అలీ తాను పాక్ జాతీయుడిగా పేర్కొనటంతో ఆ మొత్తం ఎవరికి చెందుతుందన్న అంశం 65 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే 2003 నుంచి భారత ప్రభుత్వం ఈ మొత్తం తమకే చెందుతుందని వాదిస్తోంది. ఈ మొత్తం భారత్‌కు వస్తే అందులోనూ నిజాం వారసులకు వాటా వచ్చే అవకాశం ఉంది.
లండన్‌లో ముఫకం జా..
మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో మనవడు ముఫకం జా. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు.
0 comments:
Post a Comment