హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల నల్లధనం 6 వేల కోట్లు!
తాజా బాంబు పేల్చిన కేజ్రీవాల్ బృందం
700 మందికి ఆ బ్యాంకులో ఖాతాలున్నాయని ఆరోపణ..
జెనీవా బ్యాంకులో గుప్త సొత్తుల గుట్టురట్టు
అవినీతికి ప్రభుత్వ ప్రోత్సాహం.. మండిపడిన కేజ్రీవాల్
- అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు
- మొటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ (రిలయన్స్ గ్రూప్) ఖాతాలో రూ.2100 కోట్లు
- కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్ ఖాతాల్లో రూ.125 కోట్లు
- డాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు
న్యూఢిల్లీ,
నవంబర్ 9: కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు! అధికార, ప్రతిపక్ష నేతల
బండారాలు బయటపెట్టిన కేజ్రీవాల్... తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవర్గాల
గుప్త సొత్తుల గుట్టురట్టు చేశారు. స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని
హెస్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతదేశానికి చెందిన 700 మంది ఆరువేల కోట్ల రూపాయల
నల్లధనాన్ని దాచుకున్నారని సంచలన ఆరోపణ చేశారు! దేశంలో ప్రముఖ
వ్యాపారవేత్తలైన అంబానీ సోదరులు మొదలుకుని జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్
గోయల్, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, డాబర్ ప్రమోటర్లకు ఈ బ్యాంకులో రహస్య
ఖాతాలు ఉన్నాయని బయటపెట్టారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించడం వల్లే
విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయుల అవినీతి ధనం గుట్టలు పడుతోందని ఆగ్రహం
వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బడా
వ్యాపారవేత్తలకు తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. హవాలాను
ప్రోత్సహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేజ్రీవాల్
డిమాండ్ చేశారు. ఎస్‌బీఐలో కన్నా.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతా
తెరవడం చాలా సులభమని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం
కొట్టిపారేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు సైతం ఇదే మాట
చెప్పారు.
దేశంలోని బడా నేతల అవినీతి భాగోతాలను బయటపెడుతున్న
ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం
నల్లధన కుభేరులపై విరుచుకుపడ్డారు. దేశంలో నల్ల ధనాన్ని ప్రభుత్వమే
ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనంపై చర్చ
జరుగుతోందికానీ, దాన్ని వెనక్కి రప్పించడంలో ఏ ప్రభుత్వం గట్టిగా
ప్రయత్నించలేదని విమర్శించారు. నల్లడబ్బును దాచిన నేతల వివరాలు తెలిసి కూడా
ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. స్విట్జర్లాండ్
దేశంలోని జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 700 మంది భారతీయులకు ఖాతాలు
ఉన్నాయని తెలిపారు. ఆ ఖాతాల్లో మొత్తం రూ.6000 కోట్ల డబ్బు మూలుగుతోందని
సంచలనాత్మక ఆరోపణ చేశారు. భారత్‌లో నల్లధనాన్ని హెచ్‌ఎస్‌బీసీ
ప్రోత్సహిస్తోందన్నారు.
ఆ
బ్యాంకులో ఖాతాలు కలిగిన వారిలో అంబానీ సోదరులు, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి
నరేశ్‌గోయల్, కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీ కోర్ గ్రూప్ సభ్యురాలు
అనూటాండన్‌లు ఉన్నారని చెప్పారు. వారు భారీ ఎత్తున ఆ బ్యాంకులో నల్ల
ధనాన్ని దాచారని ఆరోపించారు. ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ
న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో కలిసి కేజ్రీవాల్ విలేకరులకు వెల్లడించారు.
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో రహస్య అకౌంట్లు కలిగిన బడా వ్యక్తుల వివరాలు ఇంకా
తమ వద్ద ఉన్నాయన్నారు. వందల కోట్లు దాచిన వారిపై ఈగ కూడా వాలనీయకుండా,
చిన్నవారిపై దాడులు చేస్తోందని ఆరోపించారు. అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో
రూ.100 కోట్లు ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. వారి తల్లి కోకిలా బెన్
ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. యశోవర్ధన్ బిర్లా ఖాతాలో కూడా జీరో
బ్యాలెన్స్ ఉందని, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మొటెక్ సాఫ్టవేర్ సంస్థ
ఖాతాలో రూ.2100 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్
టాండన్‌కు చెందిన ఖాతాల్లో రూ.125 కోట్లు.. దాబర్ కంపెనీకి చెందిన
బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని
కేజ్రీవాల్ వివరించారు. ఈ వివరాలన్నీ 2006లో సేకరించినవిగా వెల్లడించారు.
కొత్త ఆరోపణలేంకాదు: ప్రభుత్వ వర్గాలు
నల్లధనంపై
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ఆయన చేసిన
ఆరోపణల్లో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. పైగా వాటికి సరైన ఆధారాలను కూడా ఆయన
చూపడంలేదు’ అని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం రాత్రి పేర్కొన్నాయి.
‘ఆదారాల్లేని ఆరోపణలపై నేను స్పందించను’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి
జనార్దన్ ద్వివేది కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు.
జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో తమకు ఎలాంటి అక్రమ ఖాతాలు లేవని..
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అంబానీ సోదరులు తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా
ఆర్‌ఐఎల్ నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఎన్నో బ్యాంకులతో సంబంధాలు
ఉన్నాయని.. అందులో హెచ్‌ఎస్‌బీసీ ఒకటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కొన్ని స్వార్థపూరిత శక్తుల వల్లే కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని
ఆరోపించింది. హెచ్‌ఎస్‌బీసీలో నల్లధనాన్ని బయటపెట్టాలని బీజేపీ నేత అద్వానీ
కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ
అనూటాండన్, జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్‌గోయల్, దాబర్ ప్రమోటర్స్ బర్మన్స్
సోదరులు ఖండించారు. హెచ్‌ఎస్‌బీసీ కూడా ఆరోపణలను ఖండించింది.
ఇంటి నుంచే హెచ్‌ఎస్‌బీసీ ఖాతా ఓపెన్.. నిర్వాహణ
హెచ్‌ఎస్‌బీసీ
బ్యాంకులో ఖాతా తెరవాలంటే జెనీవా వెళ్లనక్కర్లేదని, ఆ బ్యాంకు ప్రతినిధులే
ఇంటికి వస్తారని కేజ్రీవాల్ చెప్పారు. డబ్బులు కూడా వారికే
అప్పగించొచ్చునన్నారు. శ్రమ లేకుండా ఆన్‌లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్
చేసుకోవచ్చన్నారు. అవసరమైనప్పుడు సంప్రదించడానికి కాంటాక్ట్ నెంబర్
ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో హెచ్‌ఎస్‌బీసీ వల్ల హవాలా వ్యాపారం జోరుగా
సాగుతోందన్నారు. వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్‌బీఐతో పోలిస్తే స్విస్ బ్యాంకులో ఖాతా తెరవడం చాలా సులభమన్నారు.
హెచ్‌ఎస్‌బీసీ విధానాల వల్ల ఉగ్రవాదులకు మేలు జరుగుతోందన్నారు.
పాకిస్థాన్‌లో ఉండి భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న
ఉగ్రవాదులకు, నేరస్తులకు ఈ బ్యాంకు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం
సులభమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశ ద్రోహం,
భారత్‌పై యుద్ధం ప్రకటన వంటి కేసులను నమోదు చేసి, ఆ బ్యాంకు అధికారులను
అరెస్టు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆ బ్యాంక్ హవాలా దందా
చేస్తుందనడానికి ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలన్నారు.హెచ్‌ఎస్‌బీసీలో 700
మందికి ఖాతాలు ఉంటే 125 మందిపైనే దాడులు నిర్వహించడానికి కారణం ఏమిటని
కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
నల్ల కుబేరులకు ప్రణబ్‌అండ: కేజ్రీవాల్
హెచ్‌ఎస్‌బీసీ
బ్యాంకులో ఖాతాలున్న 700 మంది బడా నేతలకు కాపాడ్డానికి అప్పటి ఆర్థిక శాఖ
మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రయత్నించారని కేజ్రీవాల్ ఆరోపించారు. వారి
నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి వాలెంటరీ డిస్‌క్లోజర్ ఆఫ్ ఇన్‌కం స్కీం
(వీడీఐఎస్)ను ప్రవేశపెట్టారని చెప్పారు. విపక్షాల విమర్శలకు జడిసి దాన్ని
విరమించుకున్నారన్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద వారికి మినహాయింపు
ఇవ్వాలని కూడా ముఖర్జీ ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం బడా
వ్యక్తులకు అమ్ముడుపోయిందన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. దేశ
ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం వారికి తాకట్టు పెట్టిందని
విమర్శించారు. ఈ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారి వివరాలు
అధికారికంగా నిరూపించడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఇటీవల
మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కించుకున్న ఓ కాంగ్రెస్ నేత చెప్పిన
వివరాల ప్రకారమే తాము ఈ పరిశోధన చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై ఆదాయపు
పన్ను శాఖ దాడి చేసి రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే మరింత
కూపీలాగి ఈ ఖాతాల వివరాలను సేకరించామని చెప్పారు.
న్యాయవ్యవస్థే తదుపరి లక్ష్యం
రాజకీయ
నేతలు, పారిక్షిశామికవేత్తలపై ఆరోపణలు చేసిన సంచలనం సృష్టించిన కేజ్రీవాల్
తదుపరి ఆరోపణలు ఎవరిపై అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి ఆయన శుక్రవారం
సమాధానం ఇచ్చారు. దేశంలోని న్యాయవ్యవస్థే తమ తదుపరి లక్ష్యమన్నారు.
దేశంలోని అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసులు ఏళ్ల తరబడి తీర్పుకు నోచుకోకుండా
వాయిదాలు పడ్డం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ
ఆధారాలతో మీరు కోర్టుకు ఎందుకు వెళ్లరు అన్న ప్రశ్నకు సమాధానంగా.. మేం
కోర్టును ఆశ్రయిస్తే.. ప్రభుత్వం అక్కడ మేనేజ్ చేస్తుందని వ్యాఖ్యానించారు.
- T News
0 comments:
Post a Comment