తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది
తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్‌రాజు
- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్‌రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’
తెలంగాణ
ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్
గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు,
సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన
సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో
థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో
పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్‌ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను,
ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు నివాసంపైనా గుర్తు
తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర
దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్
నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో
దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు అతికష్టంమీద దిగి వచ్చారు.
సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా
నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను
తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను
శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం
చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం
అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే
వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి
పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర
ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే
తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు
ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల
ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని
ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు
చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ
తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్‌ఎస్
అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల
అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని
అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి
నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్
చర్చించినట్లు సమాచారం.
పూరీ సారీ
‘కెమెరామెన్
గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో
దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్‌రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా
ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు.
అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ
మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు
ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ
నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం
తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్‌రాజుతో చర్చించి తొలగించామని
చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు,
నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు
తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా
అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్,
అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే
విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను
అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా
దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ..
రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ
సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం
మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం
బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట
వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి
చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.
0 comments:
Post a Comment