టెట్టా .. డీఎస్సీనా (TET / DSC)
- రెండింటిలో ఏదో ఒకటే.. అధ్యయనంపై ప్రభుత్వ యోచన
- మంత్రి పార్థసారధి వెల్లడి.. ఈ డీఎస్సీకి వర్తింపు డౌటే !
- టెట్‌పై అభ్యర్థుల్లో వ్యతిరేకత.. శాస్త్రీయత లేదంటూ ఆందోళన
హైదరాబాద్, జనవరి 17 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జాతీయ విద్యా, ఉపాధ్యాయ శిక్షణా మండలి మార్గదర్శకాల మేరకు టెట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా లేని టెట్ రాష్ట్రంలో ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా ప్రభుత్వ ఆలోచనలను బలవంతంగా రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎంపికకు అభ్యర్థుల వడపోతకు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో టెట్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా డీఎస్సీ, టెట్‌లలో ఏదో ఒక పరీక్ష నిర్వహించేలా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పి. పార్థసారధి తెలిపారు. అలా కాకుంటే ఈ రెండు పరీక్షలు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలా? అనేది అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే టెట్ రెండు సార్లు నిర్వహించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీకి టెట్ వర్తింపజేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం యోచన బాగానే ఉన్నప్పటికీ ఈ అధ్యయనం పూర్తి చేయటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త డీఎస్సీకి ఇది వర్తించే అవకాశం కనిపించటం లేదు. డీఎస్సీ రాత పరీక్షకు అర్హతలు ఇప్పటికే విద్యాశాఖా ప్రకటించింది.
సివిల్స్‌స్థాయి ప్రమాణాలా..!
భారత సర్వీసులు, గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా ప్రమాణాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపికకు పెట్టడంతో అభ్యర్థులు హడపూత్తి పోతున్నారు. సివిల్స్ ఎంపికకు డిగ్రీ కలిగి ఉండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు మూడు అంచెలు దాటి వసే ్త అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపిక అవుతారు. ఉపాధ్యాయులకు సైతం ఇదే స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, డీఎస్సీ మూడు అంచెలు దాటి రావాల్సి ఉంది. దీంతో అభ్యర్థులు సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావల్సిన పరిస్థితి నెలకొంది.
శాస్త్రీయత లేదు..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కూడా శాస్త్రీయంగా లేదు. ఇందులో ప్రధానంగా భాషా పండితులు తెలుగు, హిందీ విషయాన్ని బోధిస్తారు. కానీ వీరికి టెట్ పరీక్షలో సోషల్ సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలడగటం ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇందులో సోషల్ సబ్జెక్టుకే అధిక మార్కులు ఉండటం గమనార్హం. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలో సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. కానీ టెట్‌కు మాత్రం 60 శాతం మార్కులు సాధిస్తేనే డీఎస్సీకి అర్హత సాధించినట్లు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు సాధించాలని నిర్ణయించటం శాస్త్రీయంగా లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం టెట్ పరీక్ష ఐచ్చికంగా పెట్టుకుంటే బాగుండేది.
లేదా సాధారణ డిగ్రీ, పీజీ మాదిరిగానే 35 శాతం మార్కులు పెట్టి టెట్ పాసైతేనే డీఎస్సీకి అర్హులు అన్నా బాగుండేది. కానీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా టెట్ నిర్వహిస్తుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment