మన తురుంఖన్ తుర్రేబాజ్‌ఖాన్
- బ్రిటిష్ కోటపై దండెత్తిన యోధుడు
- సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ధీశాలి
- నేడు తుర్రేబాజ్‌ఖాన్ వర్ధంతి
- సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ధీశాలి
- నేడు తుర్రేబాజ్‌ఖాన్ వర్ధంతి
ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ రోజులవి! బ్రిటిష్ సర్కారును గడగడలాడించిన సిపాయిల తిరుగుబాటుకాలమది! సిపాయిల తిరుగుబాటంటే ఢిల్లీ, లక్నో, అవధ్, కాన్పూర్, గ్వాలియర్, ఝాన్సీ.. సాధారణంగా కళ్లముందు కదలాడే దృశ్యాలివే! కానీ.. మహత్తరమైన ఆ పోరాటంలో హైదరాబాద్‌కూ ప్రత్యేక స్థానాన్ని కల్పించిపెట్టాడు తుర్రేబాజ్ ఖాన్! ప్రస్తుత కోఠి ప్రాంతంలో ఉన్న నాటి బ్రిటిష్ కోటపై దండెత్తి.. హైదరాబాద్ సత్తా చాటిన యోధుడు! ఆ వీరుడి వర్ధంతి నేడు!
బానిస బంధనాల నుంచి మాతృభూమిని విముక్తం చేయాలన్న ఆకాంక్ష! వలస పాలనపై ఆనాడే పేలిన తూటా! శత్రువు అపారసైనిక పాటవాన్ని కలిగి ఉన్న శక్తి! కొండను ఢీకొనడమేనన్న సంగతి తెలుసు! కానీ.. పరాయి పాలకులను తరిమికొట్టడమే లక్ష్యం! ఆ లక్ష్యం కోసం ఉద్యమించాడు పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్! శత్రువుతో పోరాటంలో మరణం అనివార్యమని తెలిసినా.. అరివీరభయంకరుడై సమరాంగణంలోకి దూకాడు! బ్రిటిష్ రెసిడెన్సీపైకి తన అనుచరగణాన్ని ఉరకపూత్తించిన తుర్రేబాజ్‌ఖాన్.. తూప్రాన్ ప్రాంతంలో శత్రువుతో పోరాటంలో బలయ్యాడు!
పఠాన్ తుర్రేబాజ్‌ఖాన్.. పరాక్షికమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి నాయకుడు. ఔరంగాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్‌లో జమేదారు. అప్పటికే బ్రిటిష్ పాలకుల దోపిడీని సహించలేని స్థితికి ప్రజలు చేరుకున్నారు. వివిధ కారణాలతో సిపాయిల్లో సైతం అసంతృప్తి ప్రజ్వరిల్లింది. 1957వ సంవత్సరం వచ్చే సరికి బ్రిటిష్ పాలకులపై దేశవ్యాప్తంగా సిపాయిల్లో తిరుగుబాటు తలెత్తింది. కనీస సమాచార సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే పకబ్బందీ ప్రణాళికతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. యవతీయువకులతో పాటు స్వదేశీ పాలకులు సైతం తెల్లవాడి పాలనపై నిప్పులు కక్కుతున్న రోజులవి. ఆ సమయంలో బానిసత్వం నుంచి విముక్తికి పోరాడేలా తుర్రేబాజ్‌ఖాన్‌కు స్ఫూర్తినిచ్చాడు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్!
ఆ ధార్మిక పెద్దల ప్రభావంతో ఫిరంగీలను హతమార్చాలంటూ హైదరాబాద్ నగర గోడలపై ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఆ ప్రకటనలు పెద్ద స్ఫూర్తినే రాజేశాయి. అప్పటికి హైదరాబాద్‌లో నైజాం సంస్థానం కొనసాగుతోంది. ఆ సంస్థానంలోని కొందరు బ్రిటిష్ అధికారులను కొందర సైనికులు హతమార్చారు. ఈ విషయంలో మాట్లాడేందుకు వెళ్లిన రొహిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ అధికారులకు అప్పగించడం సైనికుల్లో మరింత ఆగ్రహం రాజేసింది. వారిని ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయించాలని తిరుగుబాటుదారులు అందరూ నిర్ణయించుకున్నారు. మక్కామసీదులో సమావేశమయ్యారు. మౌల్వీల పిలుపుతో తుర్రేబాజ్‌ఖాన్ హైదరాబాద్ రెసిడెన్సీపై దాడికి ఆ రోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరాడు. మెరికల్లాంటి తన అనుచరులు 500 మందితో కలిసి విరుచుకుపడ్డాడు.
బ్రిటిష్ రెసిడెంట్ కర్నల్ కుత్‌బెర్ట్ డేవిడ్‌సన్ నివాసంపైకి సమీప రెండు ఇళ్లపై నుంచి ఖాన్ అనుచరులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పులు జరిపారు. అక్కడి నుంచి గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు ఉరికారు. ఒకవైపు తమ సహచరులు కాల్పులు జరుపుతుండగా.. వారి రక్షణతో పుత్లిబౌలి వద్దకు చేరుకున్నారు. రాత్రి నుంచి తెల్లవారే దాకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పొద్దున చూసే సరికి ఆ ప్రాంతంలో అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ భీకర పోరులో తుర్రేబాజ్‌ఖాన్ అనుచరులు కూడా కొందరు చనిపోయారు. అయితే చెరలో ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వారు విడిపించలేక పోయారు. ఈ విఫలయత్నంలో తప్పించున్న ఖాన్.. జూలై 22న బ్రిటిష్, నిజాం బలగాలకు పట్టుబడ్డాడు.
ఆయనకు ద్వీపాంతరవాస శిక్ష పడింది. ఆ శిక్ష అమలయ్యేలోగా 1859 జనవరి 18న జైలు నుంచి తప్పించుకున్నాడు. అప్పటికే సిపాయి తిరుగుబాటను బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. మళ్లీ తిరుగుబాటుకు తుర్రేబాజ్ సమాయత్తమయ్యాడని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తలకు నజరానా ప్రకటించింది. అయినా ఆయన దొరకలేదు. కానీ.. కుర్‌బాన్ అలీ అనే నమ్మకవూదోహి చేసిన మోసానికి ఆయన ఆచూకీ బ్రిటిష్ సేనలకు తెలిసిపోయింది. తూప్రాన్‌లో తుర్రేబాజ్‌ఖాన్ ఉన్నాడన్న సమాచారంతో ఆ గ్రామంపైకి 1959 జనవరి 24న బలగాలు దండెత్తాయి. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే పోరాటంలో చివరకు తుర్రేబాజ్‌ఖాన్ ఒంటరిగా మిగిలాడు.
చుట్టుముట్టిన సేనల నుంచి తప్పించుకోలేక పోయాడు. అయినా శత్రువు కళ్లుగప్పి తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్‌తూటాలకు ఒరిగిపోయాడు. ఆయన మృతదేహాన్ని సంకెళ్లతో కట్టి తెచ్చిన తెల్లవాడు.. నేటి కోటీ ప్రాంతంలో ఒక స్తంభానికి వేలాడగట్టారు. ఈ భయంకరమైన చావును చూసి, మరెవరూ బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉద్యమించరని పాలకులు కలగన్నారు. కానీ.. తుర్రేబాజ్‌ఖాన్ స్ఫూర్తి అనంతర కాలంలో స్వాతంత్య్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చింది. బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడేందుకు దోహదం చేసింది. మౌల్వీ అల్లావుద్దీన్ మంగళంపల్లి వద్ద బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డారు. ఆయనకు 1884లో ప్రవాస శిక్ష పడింది. తుర్రేబాజ్‌ఖాన్ వీరోచిత పోరాటానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం 1957లో కోటీ ప్రాంతంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది.
0 comments:
Post a Comment