నెరవేరిన చిరు కోరిక
- కేబినెట్‌లో ‘పీఆర్పీ’.. రాష్ట్ర మంత్రులుగా సీఆర్, గంటా
- ప్రమాణం చేయించిన గవర్నర్
- కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కేబినెట్‌లోకి..
- ఐదు నిమిషాల్లో ముగిసిన తంతు
- హాజరుకాని విపక్ష నేతలు
- అధిష్ఠానం దూతగా కేబీ కృష్ణమూర్తి
- శాఖల కేటాయింపులపై తర్జన భర్జన
హైదరాబాద్, జనవరి 19 (): ఎట్టకేలకు చిరంజీవి ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర కొత్త మంత్రులుగా ‘ప్రజారాజ్యం’ తరపున సీ రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ వారి చేత ప్రమాణం చేయించారు. తొలుత రామచంద్రయ్య, అనంతరం శ్రీనివాసరావు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వీరితో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39కి చేరింది. ఉదయం 11.43కు మొదలైన కార్యక్రమం 11.48 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిష్ఠానం దూతగా ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పలువురు మంత్రులు, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, కేంద్ర మాజీ మంత్రి టీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీలు కేవీపీ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది, డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. విపక్షనేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరవలేదు.
కాగా.. ప్రమాణస్వీకారం ముగిసిందో లేదో కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత అభివృద్ధికి మంత్రి పదవులు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ది చేయాలంటే నిధుల కేటాయింపులో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పదవుల ఆశతో ఉద్యమాన్ని నీరుగార్చిన టీ కాంగ్రెస్ నేతలపై ఆ ప్రాంత ఎంపీలు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణవారికి చోటు దక్కపోవడం.. ఈ ప్రాంత నేతలకు చెంపపెట్టులాంటిదని దుయ్యబట్టారు.
వారికి తగిన శాస్తి జరిగిందని మండిపడ్డారు. ఇకనైనా పదవుల చుట్టూ తిరగకుండా ఉద్యమాన్ని నీరుగార్చొద్దని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పదవులు వాటంతట అవే వస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు, గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో భేటీ అయిన అనంతరం ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ వాటాకు సంబంధించి ఏర్పడిన లోటును త్వరలోనే సర్దుబాటు చేస్తామన్నారు. విస్తరణ జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు సీఎం కిరణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు..
Take By: T News
0 comments:
Post a Comment