తెలంగాణ ఉద్యోగులపై సర్కారు కుట్ర
- సమ్మెను సక్సెస్ చేసినందుకు కక్షసాధింపు
- ఒప్పందానికి విరుద్ధంగా 240 జీవో జారీ
- 3 నుంచి 4 వేల మందికి పెన్షన్ల నిలిపివేత
- వేలాదిగా ఆగిపోతున్న పదోన్నతులు
- అసలు విషయం తేల్చని సర్కారు
- చోద్యం చూస్తున్న తెలంగాణ మంత్రులు
కరీంనగర్,: తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ఇచ్చిన హామీలపై మాట తప్పింది. సమ్మె తర్వాత సర్కారు జారీ చేసిన 240 జీవో పుణ్యమాని వేలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ద్వంద్వ వైఖరి కారణంగా తెలంగాణలో సుమారు 45వేల పైచిలుకు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. నాలుగైదు వేల మందికి పెన్షన్లు అగిపోయాయి. ఆర్హత ఉన్నా పదోన్నతులు అందకుండా పోతున్నాయి. జీవోను సవరించి ఇచ్చిన మాట నిలుపుకోవాలని.. ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించాలని పలుమార్లు సంఘాల నేతలు కోరుతున్నా సర్కారు స్పందించడం లేదు.
ప్రభుత్వ దమననీతితో పది జిల్లాల్లోని వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తి, రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణ ఉద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగే ప్రమాదముంది. టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
ఒప్పందం వేరు.. ఇచ్చిన జీవో వేరు
తెలంగాణ సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 13 నుంచి ఆక్టోబర్ 24వరకు 42 రోజుల పాటు నిర్విరామంగా సాగిన సకల జనుల సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా 42 రోజుల సమ్మెకాలాన్ని ఆర్ధ వేతన సెలవుగా పరిగణించి మంజూరు చేస్తామని లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఉద్యోగ సంఘాలు ఆయిష్టంగానే సమ్మతించాయి. సర్వీస్ బ్రేక్ కాకుండా ఉండటం, పెన్షన్, ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ప్రతిబంధకాలు ఉండవన్న ఒకే ఒక కారణంతో ఉద్యోగ సంఘాల జేఏసీలు దీనికి అంగీకారం తెలిపాయి. అయినా ప్రభుత్వం ఇక్కడా మోసమే చేసింది.
లిఖిత పూర్వక ఒప్పందం ప్రకారం జీవోలు జారీ కావాల్సి ఉన్నా.. అసలు విషయాన్ని పక్కన పెట్టింది. ఒప్పందానికి సంబంధించి 28-10-2011న జీవోనంబర్ 240 విడుదలచేసింది. జీవోలో ఎక్కడా ‘అర్ధవేతన సెలవు’ అంశాన్ని పొందుపరచలేదు. ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
అగిన ఇంక్రిమెంట్లు.. నిలిచిపోతున్న పెన్షన్లు
42 రోజుల సమ్మెకాలాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో తెలంగాణ ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంక్రిమెంట్లు, పెన్షన్ల మంజూరు, పదోన్నతులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏడాదికోమారు వార్షిక ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఏడాది పూర్తికాగానే ఉద్యోగి ఖాతాలో అటోమెటిక్‌గా ఇంక్రిమెంట్ కలుపుతారు. ఈ లెక్కన తెలంగాణ జిల్లాల్లో సుమారు ప్రతి నెలా సుమారు 10 నుంచి 15వేల మందికి ఇంక్రిమెంట్ కలుస్తుంది. సమ్మె కాలాన్ని సర్కారు తేల్చకపోవడంతో అక్టోబర్1, నవంబర్ 1, డిసెంబర్ 1న కలువాల్సిన ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోనే 6,200 పైచిలుకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. పది జిల్లాల్లో సుమారు 45వేల పైచిలుకు ఇంక్రిమెంట్లు ఆగిపోయినట్లు సమాచారం.
ప్రతి నెలలో తెలంగాణలోని ఒక్కో జిల్లాలో 100 నుంచి 120 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి పెన్షన్ మంజూరు చేసి డబ్బుల కోసం అకౌటెంట్ జనరల్ కార్యాలయానికి ఫైల్ పంపిచాలి. కానీ ఇక్కడ కూడా 42 రోజుల సమ్మె కాలాన్ని ఎటూ తేల్చకపోవడంతో 42 రో జులను సర్వీసులో ఎలా తీసుకోవాలో తెలియక ఫైళ్లను పెడింగ్‌లో పెడుతున్నారు. దీం తో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3 నుంచి 4వేల పైచిలుకు ఉద్యోగుల పెన్షన్ల మం జూరు నిలిచిపోయింది. బాధిత ఉద్యోగులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నా ప్రభుత్వం నుంచి ఎటుంటి స్పష్టత రాలేదని ఉద్యోగులుచెబుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో అన్ని శాఖల్లోనూ నెలవారీ పదోన్నతులు ఉంటాయి. అవి కూడానిలిచిపోయాయి. మొత్తంగా వేలాదిగా పదోన్నతులు నిలిచిపోతున్నాయి.
రాష్ట స్థాయి కేడర్‌లో అన్యాయం జరిగే ప్రమాదం
ప్రధానంగా ఎంపీడీవో, ఎంఆర్‌ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ హోదా గల పోస్టులను రాష్ట కేడర్‌గా గుర్తిస్తారు. ఈ విషయంలో సర్వీస్ ఒకే రకంగా ఉన్నా సమ్మెకాలం తేలకపోతే, ఆంధ్రా ఉద్యోగులు ముందకు దూసుకెళ్తారు. తెలంగాణ ఉద్యోగులు వెనుకపడే ప్రమా దం పొంచి ఉంది. తద్వారా ఉన్నత పదవుల పదోన్నతుల్లో భారీగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనుంది. సమ్మెకాలానికి సరిపోయేలా సెలవుల్లో పనిచేయాలని ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందనే విమర్శలు వెల్లు టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రులు స్పందిస్తేనే సమస్యకు మోక్షం
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేల్చిచెప్పకపోతే మున్ముందు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అస్కారం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసేలా ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు ఒత్తిడి తేవాలని పలువురు కోరుతున్నారు.
Take By: T News
0 comments:
Post a Comment