తెలంగాణపై చర్చకు సుష్మా నోటీసు
న్యూఢిల్లీ : తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షనాయకురాలు, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. గత వర్షాకాల సమావేశాల్లో సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రం, నేటి వరకు ఈ అంశంపై ఎటూ తేల్చలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణపై సుధీర్ఘ చర్చ చేసి, సమస్య పరిష్కారానికి మార్గం వెతకాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని గతం నుంచి బీజేపీ అగ్రనేతలు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జనచేతన యాత్ర సందర్భంగా బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా పదేపదే తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని, రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వారు ఇవ్వని పక్షంలో 2014 ఎన్నికల అనంతరం ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని ఆయన చెప్పిన విషయం కూడా విదితమే. అంతేకాక నల్గొండలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ పోరు సభలో సుష్మాస్వరాజ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పూర్తిగా వెనుకబడి పోయిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని ఆమె పేర్కొన్న విషయం విదితమే. ఈ నెల22 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రధాన అస్త్రంగా కేంద్రాన్ని, కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు ఇప్పుడు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చకు సుష్మా నోటీస్ ఇచ్చింది.
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
0 comments:
Post a Comment