లోక్‌సభకు తెలంగాణ ఝలక్!
- చర్చ కోసం పట్టుబట్టిన కేసీఆర్, విజయశాంతి
- సంఘీభావం ప్రకటించిన ఇతర సభ్యులు
- స్తంభించిన లోక్‌సభ.. రెండు సార్లు వాయిదా
- పరిస్థితి సద్దుమణగక.. నేటికి వాయిదా
- వాయిదాతో చర్చకు రాని టీఆర్‌ఎస్ తీర్మానం
- చర్చకు నేడు మరో నోటీసు
- తెలంగాణకు మద్దతిచ్చిన బీఎస్‌పీ, విపక్షాలు
- గాంధీ విగ్రహం వద్ద టీ కాంగ్రెస్ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ, నవంబర్ 22 ():ధరల పెరుగుదల, నల్ల ధనం, అవినీతి, తెలంగాణ అంశాలతో లోక్‌సభ మొదటి రోజు సమావేశాలు దద్దరిల్లాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మంగళవారం నాడు ప్రారంభమైన సభ రెండుసార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన సమయానికి కూడా గందరగోళం కొనసాగడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వం భయపడిన విధంగానే తెలంగాణ అంశంలో విపక్షాలన్నీ ఏకమవ్వగా, సొంత పార్టీ ఎంపీలు సైతం ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఒక్క సమాజ్‌వాది పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలూ తెలంగాణకు మద్దతిచ్చాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని స్పీకర్ మీరా కుమార్‌కు టీఆర్‌ఎస్ వాయిదా తీర్మాన నోటీసు అందించింది. దానిపై చర్చకు పట్టుబడుతూ ఆ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. తెలంగాణ అంశంపై చర్చకు అనుమతించేంతవరకు సభను కొనసాగనిచ్చే ప్రసక్తే లేదంటూ సభను స్తంభింపజేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వీరితో బీఎస్పీ ఎంపీలు గొంతు కలిపారు. కేసీఆర్‌ను బీ ఎస్పీ పార్లమెంటరీ పక్ష నేత దారాసింగ్ చౌహాన్ ప్రత్యేకంగా కలిసి తెలంగాణకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై చర్చకు స్పీకర్ అనుమతించని పక్షంలో టీ ఎంపీలకు సంఘీభావంగా వెల్‌లోనే నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు బీఎస్పీ ఎంపీ ఒకరు చెప్పారు. అదే క్రమంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో టీ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
ఆరు వందల మంది చేసిన ప్రాణ త్యాగాలను గుర్తించైనా తెలంగాణ హామీని నిలబెట్టుకోవాలని ఎంపీలు వివేక్, రాజయ్య, మధుయాష్కీ, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌డ్డి, బలరామ్ నాయక్, పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సహా వివిధ అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. సభ రెండు సార్లు వాయిదా పడినప్పటికీ పరిస్థితులు కుదుటపడనందున బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే బుధవారం నాడు సభలో తెలంగాణపై చర్చను కోరుతూ స్పీకర్‌కు టీఆర్‌ఎస్ మరో నోటీసు ఇవ్వనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల 700 మంది విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న అంశంపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టుబట్టనున్నారు. సభ వెలుపల కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మహాత్ముని విగ్రహం వద్ద ప్ల కార్డులు ప్రదర్శించారు.
తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకతో సభలోనే కాదు సభ వెలుపలా తెలంగాణ సందడి నెలకొంది. పార్లమెంటు ప్రాంగణంలో, సెంట్రల్ హాల్‌లో ఆయనకు తారసపడ్డ వివిధ పార్టీల ఎంపీలు జై తెలంగాణ అంటూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మరీ ముఖ్యంగా శివసేన, జేడీ(యూ), అకాలీదళ్, బీజేడీ తదితర పార్టీల నాయకులు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తెలంగాణకు మద్దతిస్తుందన్నారు. ‘తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే’ అని లాలూ అన్నారు. బీజేపీ సభ్యులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో కేసీఆర్‌ను కలిసిన ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారట కదా.. అని వాకబు చేశారు. తెలంగాణలో అన్ని పక్షాలు మద్దతిస్తున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీకి అభ్యంతరం ఎందుకని అసంతృప్తిని ప్రదర్శించారు.
తాత్సారం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదే వైఖరి కొనసాగితే తెలంగాణలో పార్టీ గల్లంతు కావడం తప్పదని అన్నారు. సభ లోపలా, వెలుపలా మంగళవారం నాటి తెలంగాణ పరిణామాలను నిశితంగా గమనించిన ఓ రాజకీయ విశ్లేషకుడు, ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే అన్ని పార్టీలు ఏకక్షిగీవంగా అమోదిస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటికే బలహీనమైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టడమా లేక పార్టీని భూస్థాపితం చేసుకోవడమా అన్నది కాంగ్రెస్ పెద్దలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతైనా తెలంగాణ రావాల్సిందేనన్న వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొన్నందున కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఆ పార్టీ నాయకుల చేతిలోనే ఉందని అన్నారు.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, Rajasabha, Loksaba,
0 comments:
Post a Comment