తెలంగాణ’ తో దద్దరిల్లిన పార్లమెంటు
కెసిఆర్, విజయశాంతి తెలంగాణ బిల్లు పెట్టాలంటూ నినాదాలు చేస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. సభా సజావుగా జరగనివ్వాలని స్పీకరు విజ్ఞప్తి చేసినప్పటికీ లాభం లేకపోయింది. తెలంగాణ అంశం సభ కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తర్వాత సభ సమావేశమయి నప్పటికీ సభ్యుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. బిజెపి, తెరాస, కాంగ్రెస్ పార్టీ చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని నిరసన తెలియజేశారు.
చివరకు స్పీకరు సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విజయ్‌చౌక్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మంద జగన్నాథం, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కి తదితరులు పార్లమెంటు సమీపంలోని విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టే వరకు తాము విశ్రమించేది లేదని, తెలంగాణ ప్రాంత ప్రజలు తమపై పెట్టిన విశ్వాసాన్ని వమ్ముచేయజాలమని ప్రకటించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తాము జేబులో రాజీనామా పత్రాలు సిద్ధంగా వుంచుకుని తిరుగుతున్నామని అవసరమైపుడు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు.ఇది ఇలా వుండగా బుధవారం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీ కావూరి సాంబశివరావు హైదరాబాదు లో చేసిన ప్రకటనపై తెలంగాణ ఎంపీలు గుర్రుగా వున్నారు. సాంబశివరావు అవినీతి చక్రవర్తి అని ఆయన సంగతి తేలుస్తాం ఆయన అవినీతి బట్టబయలు చేస్తామని ఎంపీ మధుయాష్కీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దాటవేత ధోరణి : సుష్మాస్వరాజ్
ఇప్పటికే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని తాను 10 మార్లు నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తోందని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేయాలని సుష్మ డిమాండ్ చేశారు.
సభను సాగనివ్వం
తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎంపీ లు ఉదయం ఎంపీ రాజగోపాల్ రెడ్డి నివాసంతో సమావేశమయి ఎట్టి సరిస్థితులలోనూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదన చేయని పక్షంలో సభను సజావుగా సాగనివ్వ మని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రకటన చేయక పోతే రాజీనామా తప్పదని తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది ఎంపీలు అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు.
సీమాంధ్ర ఎంపీల సమావేశం
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమయ్యారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, వుండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, మంత్రి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, మాగుంట సుబ్బరామిరెడ్డి తదితరులుసమావేశమై భవిష్యత్ ప్రణాళికపై చర్చించుకున్నారు.
శుక్రవారం కూడా సభను స్తంభింపజేస్తాం : టీఆర్‌ఎస్
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు సభను స్తంభింపజేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment