జీతాలు మహాప్రభో
గురువారం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు తక్షణం ఫిబ్రవరి నెల జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన ముఖ్య కార్యదర్శిని కలిసిప్రత్యేకంగా విన్నవించుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో మెట్టు దిగడంలేదు. డిక్లేరేషన్ ఇస్తేనే... పూర్తి స్తాయి జీతాలు చెల్లిస్తామని సీఎస్ వారితో పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు మరో రెండు రోజుల సమయం పడు తోందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. గురువారం రాజ్‌భన్ ఉద్యోగులతోపాటు మంత్రులు, మంత్రుల పిఎస్, పిఏలు, వారి వ్యక్తిగత సిబ్బంది జీతాలు క్లియర్ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఇక మావల్ల కాదు
ఉద్యోగ సంఘాల జెఏసీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయ నిరాకరణ కొనసాగిస్తామని, తమకు జీతాలు ముఖ్యంకాదని, తెలంగాణ ఏర్పాటే తమ అంతిమ లక్ష్యమని చెబుతుండగా.. చిరు ఉద్యోగులు మాత్రం జెఏసీ పెద్ద నేతల తీరుపై మండిపడుతున్నారు.ఇక ఎంత మాత్రం ఉపేక్షించలేమని, తమ కుటుంబాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, ఇక్కడితో సహాయ నిరాకరణ ముగి ద్దామని ఇప్పటికే జెఏసీ పెద్ద నేతలతో మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ కార్య కలాపాలు ముందుకుసాగని పరిిస్థితి నెలకొనడంతో.. అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లభించే పౌరసేవలు కూడా స్తంభించిపోయాయి.
రూ. 3 వేల కోట్లకు మించని ఆదాయం
గత 15 రోజులుగా తెలంగాణ ప్రాంతంలోని సర్కార్ ఉద్యోగులు ప్రత్యేక రాష్ర్ఠం ఏర్పాటుతోపాటు ఇతరత్రా డిమాండ్లతో చేపట్టిన సహాయ నిరాకరణ ప్రభావంతో రాష్ట్ర ఖజానా 30 శాతానికిపైగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోయింది. ప్రతి నెలా ప్రభుత్వ ఖజానాకు సొంత పన్నుల వసూళ్ల ద్వారా రూ. 3,500 నుంచి రూ. 3,600 కోట్ల ఆదాయం వస్తుండగా.. తాజాగా తెలంగాణ పది జిల్లాల్లో నెలకున్న ఉద్రిక్తత వాతావరణ పరిస్థితుల రీత్యా ఇది ఫిబ్రవరి నెలలో రూ. 3 వేల కోట్లు మించకపోవొచ్చునని ఆర్థిక, రెవిన్యూ శాఖలు గగ్గోలెడు తున్నాయి.
ఫిబ్రవరి నెల వాణిజ్య పన్నుల శాఖ లక్ష్యం రూ. రెండు వేల కోట్లుదాటలేదని, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల శాఖ వసూళ్లు కూడా 30 నుంచి 40 శాత మేర తగ్గాయని రెవిన్యూ అధికారులు తెలిపారు. తొలిసారిగా ఎకై్సజ్ ఆదాయం కూడా 90 శాతానికి తగ్గిందని అధికారులు లబోదిబో మంటున్నారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులను సర్దుబాటు చేయడం తమవల్లకాదని ఆర్థిక శాఖ సీఎంకు స్పష్టం చేసినట్లు తెలిసింది. పరిస్థితి మరింత విషమిస్తే.. తాజా ఆర్థిక డిమాండ్ల రీత్యా.. ఖాజానా మరిన్ని ఆర్థిక ఇక్కట్లు చవిచూడక తప్పదని, దీంతో ఓడీ(ఓవర్ డ్రాఫ్ట్)ని ఆశ్రయించే పరిస్థితి వస్తోందని ఇప్పటికే అధికారులు సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది.
0 comments:
Post a Comment