స్వాతంత్య్రానంతరం....తెలంగాణ కోసం జరిగే ఉద్యమం అతిపెద్దది
మట్టెవాడ, మేజర్‌న్యూస్‌ః భారత దేశ చరిత్రలో 65 సంవత్సరాల తరువాత జరుగుతున్న అతిపెద్ద ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్నదేనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అన్నారు. 1946 ఫిబ్రవరి 5 వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ వరంగల్ రైల్వే ష్టేషన్ కు చేరుకున్న సంధర్భాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేకంగా టిఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంధర్బంగా పశ్చిమ ఎమెల్యే దాస్యం వినయభాస్కర్ జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళుఅర్పించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ ని ఆదర్శంగా తీసుకుని తాము గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నామని , అదే గాంధీ పేరు, ఫోటో లతో పార్టీని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాలను అణిచివేయడానికి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం గాంధీ జీ పేరు ఉన్నందుకైనా ఆ పార్టీ నాయకులు ఆయన భావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి వెంటనే తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.వరంగల్ రైల్వే స్టేషన్‌లో గాంధీ జీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు తాము కృషి చేస్తామన్నారు.
మాజీఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణోద్యమంలో 4-5 వందల మంది విద్యార్దులు ప్రాణత్యాగాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ మార్గంలో నడుస్తున్న ఉద్యమాన్ని వక్రమార్గం చేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందన్నారు.తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ మహాత్మాగాంధీ పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రం తరువాత సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఈ ప్రాంతంలో నిజాం, రజాకార్లను వెళ్ళగొట్టగా, నెహ్రూ తెలంగాణలో ఆంధ్రా రజాకార్లను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రా, తెలంగాణాలను కలిపిన నెహ్రూ అప్పుడే ఇష్టంలేకపోతే విడిపోవచ్చని కూడా సూచించారని చెప్పారు.ఇప్పుడు విడిపోతామంటే ఆటంకాలు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ దేవుడు తెలంగాణా వైపు ఉన్నాడని, అందుకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ను తన దరి చేర్చుకున్నాడని పేర్కొన్నారు.కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లం సంపత్‌కుమార్, జిల్లా నాయకులు మరుపల్లి రవి, నీలం రాజ్‌కిషోర్, చిందాలియా విజయ్‌సింగ్, మాలకుమ్మరి పరశురాం పాల్గొన్నారు.
take BY: Suryaa
0 comments:
Post a Comment