ఎస్సై పరీక్షలు వాయిదా
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీకి ఎస్‌ఐ రాత పరీక్ష వ్యవహారం అగ్ని పరీక్షలా పరిణమించింది. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంలో ప్రధానాంశమయిన 14 ఎఫ్‌ను తొలగించేవరకూ ఎస్‌ఐ రాత పరీక్షను వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యార్థులు, ఓయు స్వతంత్ర జేఏసీ గత కొద్దిరోజుల నుంచీ చేసిన ఉద్యమం ఫలించింది. పరీక్ష వాయిదా వేస్తున్నామని, రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితి నెల కొన్నప్పుడే తిరిగి పరీక్ష నిర్వహిస్తామని హోం మంత్రి సబితా శుక్రవారం ప్రకటించారు. ఆ మరుక్షణమే సీమాంధ్రలో అగ్గి రాజుకుంది. విద్యా ర్థులు సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ముఖ్య మంత్రి, హోంమంత్రి దిష్టిబొమ్మలను తగుల బెట్టారు.
శనివారం సీమాంధ్ర బంద్ ప్రకటిం చారు. తెలంగాణకు చెందిన హోంమంత్రి సీమాం ధ్రకు అన్యాయం చేశారంటూ ఆరోపిస్తున్నారు.ఎస్‌ఐ రాత పరీక్ష కేంద్రబిందువుగా జరుగు తున్న పరిణామాలు, నిర్ణయాలు పరిశీలిస్తే... గత ఏడాది తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కేంద్రంగా నవంబర్-డిసెంబర్‌లో జరిగిన సంఘటనలు, ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు కని పిస్తున్నాయి. అప్పుడు-ఇప్పుడూ రాష్ట్ర వ్యవహారా లపై జోక్యం చేసుకున్న కేంద్ర హోంమంత్రి చిదంబరం మళ్లీ తాజా పరిణామాల్లోనూ పెద్ద చిచ్చే రగిలించడం ప్రస్తావనార్హం. ఎెస్‌ఐ పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ఆందోళన విధ్వంసంగా మారడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ప్రధా నంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వంలోని ఓయు జేఏసీ (స్వతంత్ర) దీనిపై గురువారం సాయంత్రం స్పందించిన ముఖ్యమంత్రి రోశయ్య ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని, ఇప్పటికే శరీర దారుఢ్య పరీక్ష ఉత్తీర్ణు లయిన వారు తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యలపై ఉస్మానియాలో విద్యార్ధిలోకం భగ్గుమంది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ విద్యార్థులు ఉస్మానియా పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించారు. బస్సులు ధ్వంసం చేశారు. ప్రైవేటు సంస్థలపై రాళ్లు రువ్వారు. అర్థరాత్రి వరకూ ఉస్మానియా పరిసరాలు రణరంగమయ్యాయి. శుక్రవారం ఉదయం కూడా అవే దృశ్యాలు కొన సాగాయి. ఓయు జేఏసీ(స్వతంత్ర) కన్వీనర్ ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యాన.. దరువు అంజన్న, రామారావు గౌడ్, పుల్లారావుయాదవ్, వెంకటేష్, వెంకట్‌ముదిరాజ్, పి.కృష్ణ, సైదులు గౌడ్, దరువు ఎల్లన్న తదితర నేతలు అనూహ్యంగా ఉస్మానియా పోలీసుస్టేషన్‌ను ముట్టడించడంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. గత కొద్దిరోజుల నుంచి ఐఎస్ పరీక్షలకు సంబంధించి జరుగుతున్న ఉద్యమా లను ఈ సంఘటన కొత్త మలుపు తిప్పింది.
ఈ క్రమంలో మధ్యాహ్నం తర్వాత మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శాంతిభద్రతను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుత పరి స్థితిలో పరీక్షలు నిర్వహించే వాతావరణం లేని దృష్ట్యా ఎస్‌ఐ రాతపరీక్షలు వాయిదా వేస్తున్నా మని వెల్లడించారు. సబిత ప్రకటనతో తెలంగాణ విద్యార్ధుల్లో ఆనందం వెల్లువెత్తింది. ఇది విద్యార్థుల విజయంగా రాజకీయ పార్టీలు కూడా ప్రకటించాయి. అంతకుముందు ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రహోంమంత్రి చిదంబరంతో ఫోన్‌లో మాట్లాడారు. అప్పటికే రాష్ట్ర నిఘా వర్గాలు పరీక్ష వాయిదా వేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని నివేదిక పంపించడంతో చిదంబరం కూడా పరీక్ష వాయిదా వేయమనే సీఎంకు సూచించారు.
హోంమంత్రి ప్రకటన తర్వాత తెలంగాణ విద్యార్ధుల ఆనందం ఆకాశాని కంటితే, సీమాంధ్రలో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదాను వ్యతిరేకిస్తూ ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, నాగార్జున, శ్రీ కృష్ణదేవరాయ, సింహపురి, వేమన యూని వర్సిటీకి చెందిన విద్యార్థులు శుక్రవారం రోడ్డె క్కారు. తెలంగాణ విద్యార్థుల మాదిరిగానే విధ్వం సాలకు దిగారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్థులు నష్టపరిచారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రకటన విరమించుకునే చూడకపోతే రేపటినుంచి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో అటు సీమాంధ్ర కూడా అట్టుడుకుతోంది. ఈ పరిణామాలు పరిశీలిస్తున్న వారికి గత నవంబర్-డిసెంబర్‌లో జరిగిన సంఘటనలు, వాటి ఫలి తాలు గుర్తుకు తెస్తున్నాయి. దానిని బేరీజు వేస్తున్న వారికి తిరిగి అలాంటి ఫలితాలే ఎదురవుతా యన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. గత నవంబర్‌లో మొదల యిన తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష నిర్వహిం చారు. ఆ తర్వాత నవంబర్ 29న కేసీఆర్ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో జ్యూస్ తాగి దీక్ష విమరించారు. దీనితో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపైకొచ్చి ఆయన దిష్ఠిబొమ్మలు తగులబెట్టారు. ఇక అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం విద్యార్ధుల చేతిలోకి వెళ్లింది.
జేఏసీగా ఏర్పడిన ఓయు విద్యార్థులు డిసెంబర్ వరకూ ఉద్యమించారు. ఖమ్మం ఆసు పత్రిలో తాను జ్యూసు తాగిన వైనం విద్యార్థులకు ఆగ్రహం తెప్పిం చడంతో వ్యూహం మార్చిన కేసీఆర్ దీక్ష విమరించలేదని ప్రకటించ డంతో ఆయనను నిమ్స్‌కు తరలిం చారు. నిమ్స్‌లో పదిరోజులు దీక్ష కొనసాగించిన సమయంలో.. డిసెం బర్ 9న కేంద్రహోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమయిందన్న అనుకూల ప్రకటన చేయడంతో కేసీఆర్ దీక్ష విమరించారు. ఆయనకు మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమయింది.
చిదంబరం ప్రకటన సీమాంధ్రవాసులను రెచ్చగొట్టింది. వారు కూడా అన్ని యూనివర్సిటీల వారీగా ఆందోళన నిర్వహించారు. ప్రజాప్రతి నిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఫలితంగా.. దిగివచ్చిన కేంద్ర ం మళ్లీ అదే చిదంబరంతో డిసెంబర్ 23న విస్తృత అభిప్రాయ సేకరణ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇప్పించడం ద్వారా ముందు తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర ప్రజలను లౌక్యంగా శాంతింప చేయగలిగారు.
తాజాగా ఎస్‌ఐ రాత పరీక్షల్లోనూ మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని చల్లబరిచేందుకు ఎస్‌ఐ రాతపరీక్షను వాయిదా వేయించిన చిదంబరం, పరీక్ష నిర్వహించాలని కోరుతూ సీమాంధ్ర విద్యార్థులు ఆందోళన ప్రారంభించినందున.. అక్కడి విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు మరో లౌక్యపరమైన ప్రకటన చేయించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బహుశా.. ఐదుజోన్లకు పరీక్షలు జరిపి, హైదరాబాద్‌లో స్థానికేతరుల నిష్పత్తిని భర్తీ చేయకుండా, మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం మళ్లీ కొత్త ప్రకటన చేయవచ్చంటున్నారు.
0 comments:
Post a Comment