Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, July 13, 2010

ముల్కీ రూల్సు చరిత్ర :
దక్కన్‌ ప్రాంతంలో, హైదరాబాద్‌ రాజ్యంలో ముల్కీ, నాన్‌ ముల్కీల సమస్య ఇప్పటిదికాదు. బహుమనీ సుల్తానుల కాలంలోనే ఉత్తరాది నుండి వలస వచ్చి దక్కన్‌లో ఉద్యోగాలను కొల్లగొట్టిన ఉత్తరాది వారికి, దక్కనీ ముల్కీలకు ఎప్పుడూ ఘర్షణ ఉంటూనే ఉండేది. ఉత్తరాది నుంచి వలసవచ్చిన వీరిని ఆఫాకీలుగా వ్యవహరించేవారు. ఆఫాకీలు సైన్యంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, వర్తక, వాణిజ్యాలలో చొరబడి ఆర్థికంగా బలపడినారు. దర్బారుల్లో ప్రముఖ స్థానాలను మంత్రి పదవులను దక్కించుకున్నారు. దక్కనీలు రెండవ శ్రేణి పౌరులుగా దిగజారి పోయినారు. ప్రభుత్వంలో ఆఫాకీలదే పైచేయి అయి వారే అన్ని ప్రయోజనాలు పొందేవారు. ఈ కారణంగా ఆఫాకీలకు, దక్కనీలకు అన్ని రంగాలలో అంతరాలు పెరిగిపోయి శతృత్వం ఏర్పడి పోయింది. దీనికితోడు ఆఫీకీలు షియాలు, దక్కనీలు సున్నీలు కావడంతో మతపరమైన వైరుధ్యాలు కూడా ముల్కీ, గైర్‌ ముల్కీ సమస్యను తీవ్రతరం చేసినాయి. ఇటువంటి ముల్కీ, గైర్‌ ముల్కీ సమస్య సైన్యంలోకి చొరబడి ఘర్షణలు తలఎత్తి చివరికి 1521లో బహమనీ రాజ్యం అంతరించిపోయింది. దీని స్థానంలో ఐదు రాజ్యాలు ఏర్పాటయినాయి. అందులో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి.
గోల్కొండ రాజులు ముల్కీలను గౌరవించారు. ఉద్యోగాలలో సముచిత స్థానం కల్పించారు. స్థానిక భాషా సంస్కృతులను గౌరవించారు. అందువల్లనే కుతుబ్‌షాహీల కాలంలో ముల్కీ నాన్‌ముల్కీ సమస్య సద్దుమణిగింది.

గోల్కొండ రాజ్యం కూలిపోయిన తర్వాత మొగల్‌ చక్రవర్తి ప్రతినిధిగా ఉత్తరాది నుండి వచ్చిన అసఫ్‌జాహీలు స్వతంత్రం ప్రకటించుకొని హైదరాబాద్‌ రాజ్యాన్ని స్థాపించారు. వీరికున్న ఉత్తరాది సంబంధాల వలన లక్నో, ఢిల్లీ, ముర్షిదాబాద్‌, అవద్‌ రాజ్యాల నుండి అనేక మంది నిజాం రాజ్యంలోకి వలసవచ్చి ఇక్కడి ఉద్యోగాలలో చొరబడిపోయినారు. నిజాం నవాబులు వీరిని ప్రోత్సహించారు. ఐదవ నిజాం కాలంనాటికి ముల్కీ, గైర్‌ ముల్కీల సమస్య తిరిగి ప్రస్పుటంగా రంగం మీదకి వచ్చింది. ఐదవ నిజాం కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న సర్‌ సాలార్‌ జంగు-1 హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసును స్థాపించి ఉత్తరాది నుండి ముఖ్యంగా అలీగఢ్‌నుండి చదువుకునన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలలోకి ఆహ్వానించాడు. ఈ వలసపట్ల స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ సాలార్‌జంగు తన విధానాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత 1880 ప్రాంతంలో సాలార్‌జింగు-2 పరిస్థితి తీవ్రతను నిజాం ప్రభువుకు నివేదించి ఉద్యోగాలలో స్థానికులకే అవకాశాలు కల్పించాలని సూచించాడు. మహారాజా సర్‌ కిషన్‌ పర్‌షాద్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ముల్కీ సమస్యపై చొరవ తీసుకొని ముల్కీ ఫర్‌మానా 1919లో జారీ కావడానికి కారకుడైనాడు. 16-11-1919న నిజాం ఫర్‌మానా జారీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానికులు మాత్రమే అర్హులు. వారు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికేట్‌ని సమర్పించాలి. స్థానికులలో అర్హులు లేని పక్షంలోనే స్థానికేతరులను నియమించాలని ఆదేశించాడు.
ముల్కీలంటే ఎవరు?
ముల్కీలంటే ఎవరు? ఎవరికి ముల్కీ సర్టిఫికేట్లు ఇవ్వాలి? అన్న విషయంలో 1919లో ఫర్మానా జారీ చేసేనాటికి స్పష్టత లేదు. 12 - 15 సం.ల స్థిర నివాసం ఉన్నవారినే ముల్కీలుగా భావించేవారు. అయితే ముల్కీ సర్టిఫికేట్లు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో మరిన్ని వివరణలు ఇస్తూ 1934లో నిజాం మరొక ఫర్మానా జారీచేశారు. 7-6-1934న జారీ అయిన ఫర్మానా ఇచ్చిన విరవణ ప్రకారం.
“The person who has appointed on govt. posts has to submit mulki certificate. The precondition for the issue of mulki certificate is that the father and grand father of the applicant should have been residing in the state last 12 to 15 years. Since the precondition for the issue of mulki certificate to whom who are residing in the state last 12-15 years is not appears to be correct. Residing in the state in not sufficient but ought to have mingled in the Hyderabadi society and having properties in the state and celebrated marrage with locals.”
12-15 సంవత్సరాల స్థిర నివాసం ఒక్కటే ముల్కీ సర్టిఫికెట్‌ పొందడానికి ప్రాతిపదిక కారాదని, అభ్యర్థి తండ్రి, తాతల నివాసం, అతని వివాహ సంబంధం, అతనికి ఉన్న ఆస్తులు మొదలైనవి కూడా పరిగణలోనికి తీసుకునే ముల్కీ సర్టిఫికేట్‌ జారీ చెయ్యాలని 1934 ఫర్మానా ఆదేశిస్తున్నది.
1919లో మొదటిసారి జారీ అయి ఆ తర్వాత మరిన్ని వివరణలతో 1934లో మరోసారి జారీ అయిన ముల్కీ రూల్సు ఫర్మానా నిజాం రాజ్యం ఇండియన్‌ యూనియన్‌లో కలిపోయేదాకా అంటే 1948 దాకా నిరాఘాటంగా అమలయి స్థానికులకు ఉద్యోగాలలో సముచిత స్థానం లభించేందుకు దోహదం చేసినాయి. 1948 నుండి 1952 దాకా 4 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ రాష్ట్రం మిలటరీ పాలనలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వెల్లోడిని ముఖ్య మంత్రిగా నియమించింది. ఈ నాలుగేళ్ళ కాలంలో ముల్కీ రూల్సు తీవ్ర ఉల్లంఘనలకు గురి అయి వేలాది మంది నాన్‌ముల్కీలు హైదరాబాద్‌ రాష్ట్రంలో చొరబడినారు. వెల్లోడి ప్రభుత్వం ఈ చొరబాటును యధేచ్చగా అనుమతించింది. ఈ చొరబాటును నిరసిస్తూ 1952లో ‘గైర్‌ ముల్కీ గోబ్యాక్‌’ ఉద్యమాన్ని విద్యార్థులు చేపట్టినారు. 1952లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పడినా వెల్లోడి ప్రభుత్వంలో చోటుచేసుకున్న ముల్కీరూల్సు ఉల్లంఘనల్ని సవరించలేదు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. వరంగల్‌లో మొదలైన గైర్‌ముల్కీగోబ్యాక్‌ ఉద్యమం అన్ని తెలంగాణ జిల్లాలకు పాకింది. సమ్మెలు, క్లాసుల బహిష్కరణ, ఊరేగింపులు సర్వసాధారణమైపోయినాయి. విద్యార్థులపై లాఠీచార్జీలు జరిగినాయి. కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో మొత్తం 18 మంది విద్యార్థులు అసువులు బాసారు. వందలాది మంది గాయపడినారు. సుమారు 350 మంది విద్యార్థులను, పత్రికా విలేఖరులను అరెస్టుచేసి జైళ్ళలో నిర్భందించారు. ఇన్ని త్యాగాలు చేసినా గైర్‌ ముల్కీలు మాత్రం వెనక్కి వెళ్లిపోలేదు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విలీనం
1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రను విడదీసి ఆంధ్ర రాష్ట్రాన్ని కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రులకు రాజధాని నగరం లేదు. కర్నూలులో డేరాలలో రాష్ట్ర సచివాలయాన్ని నడుపుతున్నారు. లోటు బడ్జెటు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు హైదరాబాదు రాష్ట్రం సర్వాంగ సుందరమైన, సకల సౌకర్యాలతో ఉన్న రాజధానితో, మిగులు బడ్జెటుతో, నీళ్ళు, బొగ్గు, అటవీ సంపద తదితర ప్రకృతి వనరులతో అలరారుతున్నది. హైదరాబాద్‌ రాష్ట్ట్రాన్ని కలుపుకుంటే తప్ప ఆంధ్రరాష్ట్రం మనుగడ సాగించలేదని విశాలాంధ్ర నినాదాన్ని లేవనెత్తారు ఆంధ్రులు. భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుతోనే దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వెల్లువెత్తినాయి. దేశ సమగ్రతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘాన్ని’ జస్టిస్‌ సయ్యద్‌ ఫజల్‌ అలీ చైర్మన్‌గా, హెచ్‌.ఎన్‌ కుంజ్రూ, కె.ఎం. ఫణిక్కర్‌ సభ్యులుగా నియమించింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటుతో ఆంధ్రులు విశాలాంధ్ర ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణలో విశాలాంధ్ర భావనకు మద్దతును కూడగట్టడంలో కమ్యూనిస్టులు ప్రముఖపాత్ర పోషించినారు. హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, హయగ్రీవాచారి లాంటివారు విలీనానికి వ్యతిరేకులు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మొదట్లో విలీనానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికే అటు తర్వాత విశాలాంధ్రకు అనుకూలంగా మారిపోయినారు. రాజకీయనాయకులు ఎట్లున్నప్పటికీ తెలంగాణ ప్రజలు విలీనాన్ని వ్యతిరేకించారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ వేలాది వినతిపత్రాలు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘానికి అందినాయి. ఆంధ్రులతో కలిస్తే తాము దోపిడీకి, వివక్షకు, నిర్లక్ష్యానికి గురి అవుతామని వారు భయందోళనలు వ్యక్తం చేశారు.
ఎస్‌.ఆర్‌.సి తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నది. తెలంగాణ ప్రజల భయాలను, అభద్రతను అర్థం చేసుకున్నది. విలీనం వల్ల లాభనష్టాలను కూలంకషంగా బేరీజు వేసుకొని ఈ సిఫారసు చేసింది.
“ఉభయ ప్రాంతాల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పర్చడమే మంచింది. దానికి హైదరాబాద్‌ రాష్ట్రమని నామకరణం చెయ్యవచ్చు. 1961 ప్రాంతంలో జరుగబోయే సాధారణ ఎన్నికల తర్వాత ఒకవేళ హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ట్ర శాసనసభ్యులలో మూడింట రెండువంతుల మంది అంగీకరిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విలీనీకరణ గురించి ఆలోచించవచ్చు. అది జరగని పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగవలసి ఉంటుంది.” (ఎస్‌ఆర్‌సి రిపోర్టు, పేరా 386, 388)
ఎస్‌ఆర్‌సి సిఫారసులతో బేంబేలెత్తిన ఆంధ్రనాయకత్వం ఢిల్లీకి పరుగులు తీసింది. ఢిల్లీ నాయకత్వాన్ని లోబర్చుకున్నది. విలీనానికి వ్యతిరేకంగా ఉన్న నెహ్రూ కూడా అయిష్టంగానే విలీనానికి అంగీకరించాడు. దానికంటే ముందే ముఖ్యమంత్రి బూర్గులను లోబర్చుకొని అసెంబ్లీలో విలీనానికి అనుకూలంగా తీర్మానం చేయించినారు. 1956 మార్చి 5న నిజమాబాద్‌లో భారతసేవక సమాజ్‌ ఏర్పటుచేసిన బహిరంగ సభలో నెహ్రూ విలీనాన్ని ప్రకటించాడు. వివాహంతో పాటు విడాకుల పత్రాన్ని కూడా రాసిపెట్టినాడు ఆనాటి ప్రధాన మంత్రి నెహ్రూ. ఆయన మాటల్లోనే –
”ఒక అమాయకురాలి (తెలంగాణ) పెండ్లి ఒక తుంటరి పిల్లవానితో (ఆంధ్ర) జరుగనున్నది.”
”తెలంగాణ ఆంధ్రప్రాంతాలు కలిసి ఉండే పొంతన కుదరకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చుకున్నట్లే కొంత కాలం తర్వాత రెండు ప్రాంతాలు విడిపోవచ్చు.”(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ : 6.3.1956)
ఆ రకంగా ప్రధానమంత్రి నెహ్రూ వ్యతిరేకించినా, ఎస్సార్సీ సిఫార్సులు విలీనానికి విరుద్ధంగా ఉన్నా, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విలీనం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటయ్యింది.
పెద్దమనుషుల ఒప్పందం
ముందే చెప్పుకున్నట్లు విలీనం షరతులతో కూడుకున్నది. విలీనానికి ముందు ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. దాన్నే పెద్ద మనుషుల ఒప్పందం (Gentlemen’s Agreement) అంటాము. ఆంధ్రుల పక్షాన బెజవాడ గోపాలరెడ్డి (ముఖ్యమంత్రి), నీలం సంజీవరెడ్డి (ఉపముఖ్యమంత్రి), గౌతుల లచ్చన్న (మంత్రి), అల్లూరి సత్యనారాయణ రాజు (పిసిసి అధ్యక్షుడు) తెలంగాణ పక్షాన బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి), కొండా వెంకట రంగారెడ్డి (మంత్రి), మర్రి చెన్నారెడ్డి (మంత్రి) జెవి. నరసింగరావు (పిసిసి అధ్యక్షుడు) ఈ ఒప్పందంపై జూన్‌ 19, 1956న) సంతకాలు చేశారు.
పెద్దమనుషుల ఒప్పందంలో ముఖ్యమైన అంశాలు :
ఖర్చు ఆంధ్ర, తెలంగాణలు 2:1 నిష్పత్తిలో భరించాలి.
తెలంగాణ మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే వినియోగించాలి.
సమైక్య రాష్ట్రంలో ముల్కీరూల్సు కొనసాగుతాయి.
తెలంగాణ ప్రాంత సమగ్రాభివృద్ధి కొరకు ప్రాంతీయ మండలి ఉండాలి. నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ వ్యవహారాలు, మండలి పరిధిలో ఉంటాయి. తెలంగాణ భూములను ఇతర ప్రాంతాలు వారు మండలి అనుమతి లేకుండా కొనుటకు వీలుండదు
ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం వాడైతే ఉపముఖ్యమంత్రి తెలంగాణవాడై ఉండాలి. ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే ఉపముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం నుండి ఉండాలి.
పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన మరుక్షణం నుండే ఉల్లంఘించడం ప్రారంభించారు. ఆంధ్రప్రాంతం నుండి ముఖ్యమంత్రి అయిన సంజీవరెడ్డి తెలంగాణ నుంచి ఉపముఖ్యమంత్రిని నియమించవల్సి ఉండే. అంతవరకు తాను నిర్వహించిన అదే పదవిని ఆరోవేలుగా ప్రకటించి ఉపముఖ్యమంత్రిని నియమించడానికి నిరాకరించాడు.
ముల్కీరూల్సు ఉల్లంఘనలు
పెద్దమనుషుల ఒప్పందంలో ముల్కీరూల్సు కొనసాగిస్తామన్న హామీ అత్యంత ప్రధానమైనది. 1956 నుండి 1975 వరకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలులో ఉన్నాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడానికి ముల్కీ రూల్సును ఉల్లంఘించి వేలాది మంది ఆంధ్రులు తెలంగాణ ఉద్యోగాలలో చొరబడడమే కారణం. 1956 నుండి 1969 నాటికే సుమారు 22వేల మంది ఆంధ్రా ఉద్యోగులు ముల్కీరూల్సుకి విరుద్ధంగా తెలంగాణలో చొరబడ్డారని ఆనాడు ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఉద్యమానికి జడిసి ఈ 22వేల మందిని వెనక్కి పంపడానికి జీవో 36 ను బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. జీవో జారీ చేస్తూనే మరోవైపు ఆంధ్రా ఉద్యోగులను కోర్టుకి వెళ్ళమని ప్రోత్సహించింది. ఆంధ్రా ఉద్యోగులు జీవో 36 చెల్లదని, దాన్ని కొట్టివేయమని అభ్యర్థిస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. వారి వాదనలను మన్నిస్తూ 36 జీవో చెల్లదని దీన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పు వచ్చేనాటికి జీవో 36ను జారీ చేసిన బ్రహ్మనందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి తెలంగాణవాడయిన పి.వి. నరసింహారావును 1971లో ముఖ్యమంత్రిని చేశారు. అప్పటికే 1971 మార్చి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలోని 14 లోక్‌సభా స్థానాలలో 11 స్థానాలను తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులకు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు ప్రభలంగా వెల్లడించి ఉన్నారు. అయితే 1971 నాటికి ఉద్యమ ఉదృతి కొంత తగ్గింది.
హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు చివరకు అక్టోబరు 16, 1972 రోజు ముల్కీరూల్సు రాజ్యంగబద్దమేనని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 36 జీవో అమలుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును గౌరవించవలసింది పోయి జై ఆంధ్రాఉద్యమాన్ని లేవదీసినారు. ఎటువంటి షరతులు, హామీలు, ఒప్పందాలు లేని ఆంధ్రప్రదేశ్‌ ఉండాలి. లేనట్లయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని వారి డిమాండు. జై తెలంగాణ ఉద్యమానికి లొంగని, 370 మంది విద్యార్థుల రక్తతర్పణాన్ని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం, జై ఆంధ్రా ఉద్యమానికి లొంగిపోయి 1973 జనవరిలో పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి రాష్ట్రపతి పాలన విధించింది.
రాజీమార్గంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సెప్టెంబరు 1973లో ఆరుసూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆరుసూత్రాల పథకానికి చట్టబద్దత కల్పించడం కోసం 32వ రాజ్యాంగం సవరణ చేసి ఆర్టికల్‌ 371డి ని పొందుపర్చారు. ఈ ఆర్టికల్‌ ద్వారా భారత రాష్ట్రపతికి దఖలు అయిన అధికారాలతో రాష్ట్రపతి ఉత్తర్వులు 18.10.1975 న జారీ అయినాయి.
ఆరుసూత్రాల పథకం చట్టబద్దం కాగానే పథకం అమలు ప్రక్రియ తెలంగాణకు గొడ్డలిపెట్టయింది. ఈ ప్రక్రియలో
సుప్రీంకోర్టు ధృవీకరించిన ముల్కీరూల్సు రద్దయినాయి.
రాష్ట్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రాంత ఆదాయవ్యయాలను విడిగా చూసే ఆనవాయితీకి తెరదించారు.
ఒకే ఒక జోన్‌గా ఉన్న తెలంగాణ రెండు జోన్లుగా విడిపోయింది.
15 సంవత్సరాల స్థిరనివాస పరిమితిని నాలుగేండ్లకు తగ్గించారు.
ఆరుసూత్రాల పథకం ఆధారంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఒకవైపు స్థానికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూనే మరొకవైపు సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, కార్పోరేషన్లు, బోర్డులు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఎయిడెడ్‌ సంస్థలు యూనివర్శిటీలకు స్థానిక రిజర్వేషన్లు వర్తించకుండా మినహాయించారు. ఈ కారణంగా పైన చెప్పిన సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రభుత్వ యంత్రాంగంలో కోస్తా ఆంధ్రా ఆధిపత్యం వ్యవస్థీకృతం అయ్యింది.కేంద్రీకృతమైన కోస్తా ఆధిపత్యం వల్ల అన్ని రంగాలలో తెలంగాణ వివక్షకు నిర్లక్ష్యానికి గురి అయ్యింది. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియమాకాలలో తెలంగాణ అన్యాయానికి బలి అయ్యింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు :
ఆరుసూత్రాల పథకంలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయినాయి గాని ఉల్లంఘనల పరంపర మాత్రం ఆగిపోలేదు.
రాష్ట్రపత్తి ఉత్తర్వులను ఉల్లంఘించి 1975 నుండి 1985 నాటికి అంటే పదేళ్ళలోనే తెలంగాణలో అక్రమంగా చొరబడిన స్థానికేతరుల సంఖ్య 58 వేలు ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ ఉల్లంఘనల్ని సవరించి, అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపి, ఆ ఖాళీలలో తెలంగాణ వారిని భర్తీ చెయ్యాలని జీవో 610 చెబుతున్నది. మూడునెలల్లో అమలుకావాల్సిన జీవో 22 సంవత్సరాలైన అమలుకాలేదు. అమలుచెయ్యడానికి వలసప్రభుత్వాలు పెనుగులాడుతున్నాయి. వక్రీకరించి కొత్త జీవోలు సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. 610 జీవో అమలుపేరిట మళ్ళీ తెలంగాణ వారినే బలిచేయడానికి రంగం సిద్ధమవుతున్నది. విభజించి పాలించు అన్న వలసవాదుల సిద్ధాంతాన్ని ఆంధ్రావలసవాదులు తూ.చ తప్పకుండా అమలుచేసి తెలంగాణ జిల్లాల మధ్య బేధాభిప్రాయాలను సృష్టిస్తున్నారు. ఈచారిత్రక నేపథ్యంలో ముల్కీరూల్సు, ఆరుసూత్రాల పథకాన్ని మరోసారి విశ్లేషించుకోవాల్సి ఉంది.
ఆరుసూత్రాల పథకంలో ఆరుసూత్రాలు ఏమిటి?
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని నగరం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చెయ్యాలి. రాష్ట్రస్థాయిలో ఒక ప్లానింగు బోర్డును, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సబ్‌కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి ప్రక్రియను పర్యవేక్షించాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేరకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రవేశాలు కల్పించాలి. హైదరాబాద్‌ నగరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈ ప్రాంత విద్యాసౌకర్యాలను మెరుగుపరచాలి.
రాష్ట్ర పరిపాలనావసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పేర్కొన్న ఉద్యోగాలలో, ప్రత్యేకంగా పేర్కొన్న మేరకు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి.అవి ఏమనగా (1) నాన్‌-గజెటెడ్‌ ఉద్యోగాలు (సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలు, హైదరాబాద్‌ సిటీ పోలీసుశాఖలను మినహాయించి) (2) స్థానిక సంస్థల్లో నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలు (3) తహసీలుదారు, జూనియర్‌ ఇంజనీరు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ మొ పోస్టులు.ప్రమోషన్స్‌ కొరకు స్పెసిఫైడ్‌ గజిటెడ్‌, మొదటి మరియు రెండవ గజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలను లోకల్‌ క్యాడర్లుగా వర్గీకరించాలి.
సర్వీసు విషయాలలో నియమాకాలు, సీనియారిటీ, ప్రమోషన్లు తదితర వివాదాలను పరిష్కరించేందుకు హైకోర్టు అధికారాలున్న అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పర్చాలి. ట్రిబ్యునల్‌ తీర్పులకు రాష్ట్ర ప్రభుత్వం విధిగా కట్టుబడి ఉండాలి.
పై అంశాలకు చట్టబద్ధత కల్పించేందుకు రాజ్యాంగాన్ని తగు విధంగా సవరించాలి. పై అంశాలపై తగిన విధంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు రాష్ట్రపతికి అధికారం లభిస్తుంది.
పైన వివరించిన సూత్రాల అమలు వలన ముల్కీ రూల్సు మరియు ప్రాంతీయ కమిటి కొనసాగింపు అనవసరమైవుతాయి.
పైన వివరించిన ఆరు సూత్రాలలో మొదటి ఐదు సూత్రాలు మాత్రమే కార్యాచరణకు సంబంధించినవి. ఆరవసూత్రం మొదటి ఐదు సూత్రాల అమలుతో ముడిపడిన అంశం. ఇపుడు మొదటి ఐదు సూత్రాలు ఎట్లా అమలయినాయి. అవి ఏ మేరకు తమ లక్ష్యాలని నెరవేర్చినాయో విశ్లేషించి ఆరవ సూత్రం యొక్క ప్రాముఖ్యతని, ఇవ్వాల్టి సందర్భాలలో దీని ప్రాసంగికతను విశ్లేషించుకుందాం.
1. ఒకటవ సూత్రంలో చెప్పిట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చెయ్యాలి. తెలంగాణ మిగతా ప్రాంతాలలో పోల్చి చూసినపుడు అన్ని రంగాలలో వెనుకబడిన ప్రాంతమే. ముఖ్యంగా సాగునీటి రంగం, విద్యారంగాలలో తెలంగాణ వెనుకబాటుతనం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 1975 నుండి ఇప్పటిదాకా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు అటుంచితే అభివృద్ధి క్రమం మరింత మందగించింది. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో నెట్టివేయబడింది. విలీనానికి ముందు తెలంగాణలో చెరువుల కింద సాగే వ్యవసాయం చెరువలను నిర్లక్ష్యం చేసినందువల్ల గ్రామీణ వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. వ్యవసాయం మీద ఆధారపడిన లక్షలాది జనం దేశాలు పట్టి వలసలు పోయినారు. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే 16 లక్షల మంది ప్రజలు గ్రామాలు వదిలి వలసలు పోయినట్లు అంచనాలున్నాయి. వ్యవసాయం చుట్టూ అల్లుకొని ఉన్న కులవృత్తులూ ధ్వంసం అయిపోయినాయి. ఆ వృత్తుల మీద బతుకులు వెళ్ళదీసిన జనం బతుకులు ధ్వంసం అయినాయి. గత పదేళ్ళలో రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలో 80% తెలంగాణలో జరిగినవే. సాగునీటి సౌకర్యాల నిష్పత్తి విలీనం నాటికి ఆంధ్ర తెలంగాణల మధ్య 1.7:1 ఉంటే 2004 నాటికి అది 3.8 :1 కి పెరిగిపోయింది. సహకార బ్యాంకుల ద్వారా తెలంగాణకు అందిన రుణాలు 28% ఉంటే ఆంధ్రలో అది 72% ఉన్నది.
విద్యారంగంలో తెలంగాణపట్ల ప్రభుత్వానిది వివక్షా పూరిత విధానమే. వివిధ ప్రాంతాలలో యూనివర్శిటీలకు ప్రభుత్వం ఇస్తున్న గ్రాంటులను చూస్తే ఈ వివక్ష తెల్సిపోతుంది.
యూనివర్శిటీ గ్రాంటు ఒక్కవిద్యార్థికి :
రాయలసీమశ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ రూ. 37,500కృష్ణదేవరాయ యూనివర్శిటీ రూ. 25,000
కోస్తాంధ్ర ప్రాంతంఆంధ్ర యూనివర్శిటీ రూ. 35,500నాగార్జున యూనివర్శిటీ రూ. 22,700
తెలంగాణ ప్రాంతంఉస్మానియా యూనివర్శిటీ రూ. 17,400కాకతీయ యూనివర్శిటీ రూ. 14,000
ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు రాయలసీమ, ఆంధ్రాకు 75.93% అయితే తెలంగాణకు 24.07% మాత్రమే. అయితే రాజధాని నగరంలో వలసవాదులు అడ్డా బిఠాయించిన ప్రాంతాలైన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌ ప్రాంతాలను మాత్రం అభివృద్ధి పర్చి మిగతా నగరాన్ని మురికి కూపంగా మార్చి, ఇవాళ తామే హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి పరచామని గప్పాలు కొడుతున్నారు. ఆరుసూత్రాలలో మొదటిది అత్యంత ముఖ్యమైంది పూర్తిగా నిర్వీర్యమైంది.
2. రెండవ సూత్రంలో చెప్పినట్లు హైదరాబాద్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితే ఏర్పాటయింది గాని అది ఈ ప్రాంతంలో విద్యా సౌకర్యాలను మెరుగుపర్చడంలో ఏ పాత్ర పోషించలేదు. విద్యాభివృద్ధికి ఏ విధంగానూ దోహాదం చేయలేదు. యూనివర్శిటీలోని అధ్యాపకపోస్టులు ఇతర ఉద్యోగాలు అన్నీ స్థానికేతరుల వశమైనాయి. విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి తెలంగాణ విద్యార్థులకు ఏ ప్రాధాన్యత లేదు. అందువల్ల విశ్వవిద్యాలయం తన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి తోడు హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా అన్ని కాలేజీలలో స్థానికేతరులు చొరబడి పోతున్నారు. ఎందుకంటే ఆరుసూత్రాల పథకం ప్రకారం హైదరాబాద్‌లో 4 ఏళ్ళ స్థిరనివాసం ఉన్న ఆంధ్రులను స్థానికులుగా మార్చివేస్తుంది. అంతకుముందు హైదరాబాద్‌ నగరంలోని విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకుఅందుబాటులో ఉండేవి. ఆరుసూత్రాల పథకం కారణంగా అవి ఎండమావులుగా మారిపోయినాయి. ఈ విధంగా రెండో సూత్రంఎందుకు పనికిరాని సూత్రంగా మారిపోయింది.
3. ఇక మూడోసూత్రం ఉద్యోగాలకు సంబంధించినది. స్పెసిఫైడ్‌ గజిటెడ్‌, ఒకటం, రెండ గజిటెడ్‌ స్థాయి ఉద్యోగాలలో, కొన్ని పేర్కొన్న ఉద్యోగాలలో, నాన్‌గజిటెడ్‌ ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఈ విషయాలన్నీ పొందుపర్చారు.
32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371డి ని ప్రత్యేకంగా రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్‌ 371డి ఏం చెబుతుందంటే
” Article 371D Special Provisions with respect to the state of Andhra Pradesh (1) The president may order made with respect to the state of A.P. provide having regard to the requirements of the state as whole for equitable oppertunities and fecilities for the people belonging to different parts of the state in the matter of public employment and in the matter of education and different provision may be made for various parts of the state.”
ఆర్టికల్‌ 371డి దఖలు పర్చిన అధికారాలతో రాష్ట్రపతి ఉత్తర్వులు 18-10-1975న జారీ అయినాయి. దీన్నే ” The Andhra Pradesh public employment (organisation of local cadres and regulation of Direct recruitment) order 1975 ” గా పిలుస్తారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా జొ.వో ఎం.ఎస్‌.నెం 674 తేది : 20-10-1975న ప్రభుత్వంజారీ చేసింది. స్థూలంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని అశాలు ఇవి
రాష్ట్రాన్ని మొత్తం 6 జోన్లుగా విభజించారు. జోన్లు 1,2,3లు కోస్తా, జోను 4 రాయలసీమ , జోన్లు 5,6 తెలంగాణ జిల్లాలకు చెందినవి.
జిల్లా పోస్టుల్లో 80%, నాన్‌గెజిటెడ్‌ జోనల్‌ పోస్టుల్లో 70%, స్పెసిఫైడ్‌ గజిటెడ్‌ పోస్టులో 60% స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించారు. మిగతా ఓపెన్‌మెరిట్‌ ద్వారా భర్తీ చెయ్యాలి. ఇవి అన్‌రిజర్వ్‌డ్‌గా పరిగణించాలి.
పదవతరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ వ్యక్తిని అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు.
రాష్ట్రపత్తి ఉత్తర్వుల పరిధి నుండి సెక్రటేరియట్‌, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలు, కార్పోరేషన్లు, బోర్డులు ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందే సంస్థలు, విశ్వవిద్యాలయాల మినహాయించినారు. అంటే ఇక్కడ స్థానిక రిజర్వేషన్లు వర్తించవు. అయినప్పటికీ ఆర్టికల్‌ 371డి స్ఫూర్తితో ఈ అన్ని కార్యాలయాలలో అన్ని ప్రాంతాల లోకల్‌ క్యాడర్లకు ఫెయిర్‌ సూత్రాన్ని అమలుచెయ్యాలి.
1975లో జారీ అయిన ఉత్తర్వులు యధేచ్ఛగా ఉల్లంఘనకు గురి అయినాయి. 1985 లో 610 జివో జారీ చేసేనాటికే రాష్ట్రపత్తి ఉత్తర్వులకు విరుద్ధంగా 58వేల మంది తెలంగాణలో నియమించబడినారని శ్రీ జయభారత్‌రెడ్డి కమిటి నిర్ధారించింది. వీరిని వెనక్కి పంపి ఆ ఖాళీలలో స్థానికులను భర్తీ చెయ్యామని 610 జీవోలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో అంటే మర్చి 1986 నాటికే అమలుకావాల్సిన జీవో 22 సంవత్సరాల తర్వాత ఇంకా వివాదాలకి కారణమవుతున్నది. 1985లో 610 జీవో అమలు కాకపోగా ఉల్లంఘనల పరంపర కొనసాగింది. ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఈ అక్రమ చొరబాటుదారుల సంఖ్య 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా.
రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేనటువంటి కార్యాలయాలలో ఫెయిర్‌షేర్‌ సూత్రాన్ని పాటించకపోవడం వల్ల సచివాలయంలో 9%, శాఖాధిపతుల కార్యాలయాల్లో 16% ప్రభుత్వరంగ సంస్థల్లో 20% మాత్రమే తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. ఈ కార్యాలయాలన్నీ కోస్తామయం అయి పాలనా యంత్రాంగంలో కోస్తా ఆంధ్రా ఆధిపత్యం కేంద్రీకృతమైంది. రాష్ట్రపాలనా వ్యవస్థలో తెలంగాణకు నామమాత్రపు ప్రాతినిధ్యం వల్లనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో, నిధుల కేటాయింపులో వివక్షకు నిర్లక్ష్యానికి గురి అయ్యింది. రాష్ట్రపత్తి ఉత్తర్వులు ఎట్లా ఉల్లంఘనకు గురి అయినాయో, రాష్ట్రపతి ఉత్తర్వులను ఎట్లా వక్రీకరించుకొని నియమాకాలు, బదిలీలు, డిఫ్యూటేషన్లు జరుపుకున్నారో గిర్‌గ్లానీ కమీషన్‌ సవివరంగా తమ తుది నివేదికలో పొందుపర్చింది. రాష్ట్రపత్తి ఉత్తర్వుల ఉల్లంఘన అంటే రాజ్యాంగ ఉల్లంఘనతో సమానం. అందువల్ల ఆరుసూత్రాలలో అత్యంత ముఖ్యమైన మూడోసూత్రం ఒక బూటకంగా మారింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సాక్ష్యంగా మన ముందు నిలబడి ఉంది.
4. నాల్గవ సూత్రం ప్రకారం రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పడింది. నాల్గవ సూత్రంలో పేర్కొన్నట్లు ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అయితే తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన వేలాది తీర్పులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ట్రిబ్యునల్‌ని అపహాస్యం చేసింది. చాలా కేసులలో తెలంగాణ ఉద్యోగులకు ట్రిబ్యునల్‌లో చుక్కెదురయ్యింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పరిరక్షించడం ట్రిబ్యునల్‌ వైపల్యం చెందింది. ఇటీవలి 610జీవో బదిలీల మీద ఇచ్చిన స్టేలే అందుకు సాక్ష్యం. ఈ విధంగా నాల్గో సూత్రం అమలయినట్లు బయటకు కనిపిస్తున్నా ఆచరణలో అంతిమంగా వైఫల్యం చెందింది.
5. ఐదవ సూత్రం ప్రకారం మొదట నాల్గు సూత్రాలను చట్టబద్దం చేయడానికి రాజ్యాంగ సవరణ జరిగింది. మొదటి నాల్గు అంశాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడినాయి. అయితే నాల్గు సూత్రాలు అని ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఘోరంగా విఫలం అయినాయి. అందువల్ల ఈ ఐదవ సూత్రం ప్రకారం జరిగిన రాజ్యాంగ సవరణలకు ఏ విలువా లేకుండా పోయింది.
6. ఇక ఆరవ సూత్రం చెబుతున్న ప్రకారం మొదటి 5 సూత్రాలు అమలవుతే ముల్కీ రూల్సు మరియు ప్రాంతీయ కమిటీ అవసరం లేనివి అవుతాయి. దీన్ని మరో రకంగా విశ్లేషించుకుంటే మొదటి 5 సూత్రాలు అమలుకాని పక్షంలో ముల్కీరూల్సు, ప్రాంతీయ కమిటి అవసరం అవుతాయి. మొదటి 5 సూత్రాలు అమలు కావడంలో ఎంతగా వైఫల్యం చెందినాయో చూసాం. ఆ కారణంచేత ఆరవ సూత్రంలో చెప్పినట్లు ఇవ్శాళ ముల్కీరూల్సు, పూర్వపు అధికారాలతో ప్రాంతీయ కమిటీ అవసరం ఉన్నది. ఆరు సూత్రాలు ఆచరణలో వైపల్యం చెందిన కారణంగా ఆరవ సూత్రంలో చెప్పినట్లు ముల్కీరూల్సును, ప్రాంతీయ కమిటీని పూర్వపు అధికారాలతో పునరుద్ధరించవలసి ఉన్నది. 1972లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముల్కీరూల్సు రాజ్యాంగబద్దమేనని తీర్పు ఇచ్చినందువల్ల, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల ఒక ప్రాసంగికతను సంతరించుకున్నది. ఆరు సూత్రాల పథకం అమలుకాకపోవడం వల్ల ముల్కీరూల్సుని, ప్రాంతీయ కమిటీని 1975కు ముందున్నట్లుగా తిరిగి పునరుద్ధరించవలసిన అగత్యం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇవ్వాళ తెలంగాణ ప్రజానీకం ముల్కీరూల్సుని, పూర్వపు అధికారాలతో ప్రాంతీయ కమిటీని పునరుద్ధరించమని డిమాండ్‌ చెయ్యవల్సి వస్తున్నది.
కాలం చెల్లిన ముల్కీరూల్సుని పునరుద్ధరించమని డిమాండ్‌ చెయ్యడం పట్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగ సంఘాలు, మేధావులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముల్కీ రూల్సు రద్దయినప్పటికీ వాటికి కాలం చెల్లలేదని మేం భావిస్తున్నాం. నిజానికి ఎన్నడూ లేనంతగా ఈనాడే ముల్కీ రూల్సు అవసరం ఉందని మేం స్పష్టం చేస్తున్నాం.
ముల్కీ రూల్సు పునరుద్ధరించమని అడగడమన్నా, 610 జీవో అమలుచెయ్యమన్నా, ఆర్టికల్‌ 371డి ప్రకారం ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడమన్నా పాలనా యంత్రాంగంలో తెలంగాణకు న్యాయబద్దమైన వాటాను కోరడమే. పాలనాయంత్రాంగంలో న్యాయబద్దమైన వాటా ప్రజల సహజ సిద్ధహక్కు. ఆ హక్కును ఆంధ్రాపాలకవర్గాలు తెలంగాణకు నిరాకరిస్తున్నాయి. కనుకనే ఇవ్వాళ ముల్కీరూల్సు పునరుద్ధరణ డిమాండు ముందుకు వచ్చింది. ఇవ్వాళ కాలం చెల్లింది ఆరుసూత్రాల పథకానికే గాని ముల్కీ రూల్సుకి కాదు. రాష్ట్రపాలనా యంత్రాంగంలో తెలంగాణకు న్యాయబద్దమైన వాటా దొరకనంత కాలం ముల్కీరూల్సుకు కాలం చెల్లదు.
రేపు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ముల్కీ రూల్సు అవసరమవుతాయి. అందుకనే ముల్కీ రూల్సు పునరుద్ధరణ డిమాండ్‌ను సమర్ధించవలసిందిగా తెలంగాణ రాజకీయ నాయకులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, విద్యార్థులు ఇతర సెక్షన్ల ప్రజలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.
ఉపయుక్త గంథాలు :1. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ : ప్రొ జయశంకర్‌2. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల చరిత్ర : శోభాగాంధి3. నీళ్ళు - నిజాలు : ఆర్‌. విద్యాసాగర్‌ రావు4. తెలంగాణ డైరీ 2007 : తెలంగాణ ఉద్యోగుల సంఘం5. తెలంగాణ రాష్ట్రోద్యమాల చరిత్ర : ఆదిరాజు వెంకటేశ్వర రావు6. Revival of Mulki Rules & Regional Committee : A Document prepared by Prof. Sridhara Swamy7. S.R.C Report 1955

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP