జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
‘పంపన’కు జన్మనిచ్చి ‘బద్దెన’కు పద్యమిచ్చి
భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
‘హాలుని’ గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కి సోమన్న
’రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ
ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధు వతడు
‘దిగ్నాగుని’ కన్న నేల ధిక్కారమే జన్మహక్కు
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
‘పోతన’దీ పురిటిగడ్డ ‘రుద్రమ’దీ వీరగడ్డ
గండరగండడు ‘కొమరం భీముడే’ నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే
తెలంగాణ జై జై తెలంగాణఠిజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచెర్ల
‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి
వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
‘పిలలమఱ్ఱి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
డప్పు డమరుకము డక్కి శారదస్వరనాదాలు
పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగా
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా
తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
జానపద జనజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
బడులగుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
తడబడకుండా జగాన తల ఎత్తుకోని
జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జై జై తెలంగాణజై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥
0 comments:
Post a Comment