28 డెత్‌లైన్ - కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం
-కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తేల్చుకొనే తరుణం
-దోబూచులకు ఇక ఫుల్‌స్టాప్.. వైఖరి చెప్పడంపైనే భవిష్యత్ ఉనికి
-సాగదీతలు సహించలేని స్థితిలోఉరుముతున్న తెలంగాణం
-పార్టీల్లో అఖిలపక్షం గుబులు
హైదరాబాద్, డిసెంబర్ 26 ):ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను రాష్ట్రంలో సున్నితమైన సమస్యగా చిత్రీకరిస్తుందొక పార్టీ! ఈ సమస్య వల్లే పాలనలో అనిశ్చితి నెలకొందని తీర్మానిస్తుంది మరో పార్టీ! ఈ సమస్య తొలగిపోతే అభివృద్ధి పట్టాలకెక్కుతుందని ఆరాటపడేది ఇంకో పార్టీ! తెలంగాణపై వైఖరి చెప్పని అన్ని పార్టీలూ పలికే పలుకుల సారాంశం ఒకటే.. అదే తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం! ఇప్పుడు ఆ పార్టీల ఆవేదన తొలగిపోయే అవకాశం వస్తోంది! రాష్ట్రంలో అనిశ్చితి మటుమాయం అయ్యేందుకు తరుణం ఆసన్నమవుతోంది! అదే కేంద్రం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం! దానికి ముందు ఇది డెత్‌లైన్!! తెలంగాణపై వైఖరి తేల్చడానికి టీజేఏసీ పెట్టిన ఈ డెత్‌లైన్ దాటి ముందుకు పోయే పార్టీలు ఏం నిర్ణయించుకుని అఖిలపక్షానికి వెళతాయన్నదే ఇప్పుడు ప్రశ్న! అఖిలపక్షంలో ఏం మాట్లాడుతాయన్నదే సందేహం! అవి చెప్పే వైఖరిపైనే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీల మనుగడ! ఏం జరుగుతుంది? ఆ పార్టీలు తెలంగాణలో మనుగడ సాగిస్తాయా? ఉనికి నిలుపుకుంటాయా? వాటి అస్తిత్వం తెలంగాణలో నిలబడుతుందా? అఖిలపక్షంతో తేలిపోనుందనేది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీలు దురదృష్టవశాత్తూ మాటలకే పరిమితమవుతున్నాయి.
తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరే పార్టీలే.. సమస్యను ఎప్పటికప్పుడు మరింత జటిలం చేస్తూ పోతున్న వైచివూతికి రాష్ట్ర రాజకీయాలు అద్దంపడుతున్నాయి. వైఖరి చెప్పేసిన పార్టీ లు బిందాస్. ప్రత్యేక రాష్ట్ర సాధనకే పుట్టిన టీఆర్‌ఎస్ వైఖరి విస్పష్టంగా ఉంది. సమైక్యవాదం నుంచి జై తెలంగాణ నినాదం అందుకున్న సీపీఐ.. రాష్ట్ర సాధన సమరంలో దూసుకుపోతున్నది. పార్లమెంటులో బిల్లు పెడితే ఆమోదం పొందేందుకు బేషరతు సహకారానికి బీజేపీ సై అంది. హైదరాబాద్ సహిత తెలంగాణ లేదా రాయల తెలంగాణ అని ఎంఐఎం తేల్చి చెప్పింది. తాను సమైక్యవాదినేనని సీపీఎం కుండబద్దలు కొట్టేసింది! ఇక మిగిలింది మూడు పార్టీలే. తెలంగాణపై ఆది నుంచి దోబూచులాడుతున్న ఆ పార్టీలకే ఇప్పుడు సంకట స్థితి. అందుకే ఈసారి జరిగే అఖిలపక్ష సమావేశం ఆ మూడు పార్టీల్లో గుబులురేపుతున్నది. తెలంగాణ రాష్ట్రం విషయంలో ‘డిసెంబర్ 9’ ప్రకటన శిలాశాసనంగా యావత్ తెలంగాణ ప్రాంతం విశ్వసిస్తున్నది. ఏనాడో సిద్ధించిన రాష్ట్రాన్ని ఆచరణలోకి తేవడమే మిగిలిన ఎజెండాగా భావిస్తున్నది. ఈ క్రమంలోనే అడ్డుపడుతున్న పార్టీలకు అల్టిమేటాలు జారీ అవుతున్నాయి.
తెలంగాణ విషయంలో దోబూచులను నమ్మబోమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పులు వెలువరించారు. వరుస ఉప ఎన్నికల్లో తెలంగాణవాదానికి పట్టంగట్టారు. వ్యతిరేక పార్టీల శవపేటికలకు ఒక్కో ఉప ఎన్నికలో ఒక్కో మేకు దించుతూ వచ్చారు. ఇక పతాక సన్నివేశం!! అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అనేక మతలబులను తెలంగాణ సమాజం చూసింది. కేంద్రంలో తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన ఎఫ్‌డీఐల ఓటింగ్ గండం నుంచి గట్టెక్కేందుకే ఈ అఖిలపక్షం హామీ వచ్చిందన్నది జగమెరిగిన సత్యం. అఖిలపక్షంతో సాధించేది ఏమీ లేదని, ఇది కేవలం కొత్త హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ తేల్చిపారేశారు. ఈ సమావేశం ఉత్తుత్తిదేనని హోం శాఖ వర్గాలు లీకులు కూడా ఇచ్చాయి.
అయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు.. ఈ సమావేశం తెలంగాణవాదానికి ఒక మూలమలుపుగా కూడా మారనుంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్నాయి. టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి.. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అందులోనే తమ అభివూపాయం చెబుతామని ప్రకటనలు చేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న వాదననైనా ఆ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వైఖరి చెప్పకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు పార్టీలను సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే తెలంగాణ ఉద్యమక్షిశేణులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చి ఉన్నాయి. ముసుగులో గుద్దులాటలను ఇక విశ్వసించే స్థితిలో ఈ ప్రాంతం ప్రజలు లేరని వెల్లడైపోయింది. అందుకే ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రాజకీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే.. తమ వైఖరి చెప్పకుండా తప్పించుకునేందుకు మార్గాన్వేషణ చేస్తున్న ఈ మూడు పార్టీలు.. నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టేసే ఆలోచన చేస్తున్నాయని ఆయా పార్టీల నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమ వుతోంది.
మొత్తంగా టీడీపీ, వైఎస్సార్సీపీలు కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ సమస్య మూలాలను తెలుసుకునేందుకు షిండే ఈ సమావేశం ఏర్పాటు చేశారని భావించే పరిస్థితి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలుగా అవి తెలంగాణపై ఏ దృష్టితో ఉన్నాయో తెలుసుకోవడం ఈ ‘అవగాహన’ సమావేశం ఉద్దేశంగా చెబుతున్నారు. కాబట్టి ఈ మూడు పార్టీలు తమ వైఖరిని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే ఈ సమావేశం ఆ మూడు పార్టీలకు జీవవన్మరణ సమస్యగానే మారుతోంది. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలు తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేయడంతో, ఈ సమావేశంలో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆ మూడు పార్టీలపై ఉంది. బాధ్యత నెరవేరుస్తాయా? భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటాయా? అనేది ఆ పార్టీలు వెల్లడించే వైఖరిపైనే ఆధారపడి ఉంటుందనేది నిపుణుల విశ్లేషణ. వ్యతిరేకం కాదన్న మాటనే స్పష్టగా చెప్పి.. తెలంగాణ ఏర్పాటుకు అడ్డం తప్పుకోవాలనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష! పార్టీ వైఖరిని తేల్చి.. తెలంగాణ ప్రాంతంలో మనుగడకు అవకాశం కల్పించాలనేది ఆ మూడు పార్టీల్లోని తెలంగాణ నేతల ఆశ! అందుకే అందరి దృష్టీ అఖిలపక్షంపైనే!!
0 comments:
Post a Comment