సంబురాలు సంక్రాంతి
పల్లెల్లో సంక్రాంతి పండుగ సందడి. కొత్త అల్లుళ్ల రాకలు. యువకుల గాలిపటాల కేరింతలు. పిల్లల బొమ్మరిల్లాటలు. ఇలా హడావిడి మధ్య, ఎముకలు కొరికే చలితో సయ్యంటూ సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. మూడు రోజులు జరుపుకునే పండుగ ఎంతో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. ఆడబిడ్డల రాకతో పల్లెల్లో కళకళలాడుతుంటాయి. పండుగ రోజు ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లులను తలపించే ముగ్గులేసేందుకు యువతుల ఉత్సాహాలు ఒకవైపు. డూడూ బసవన్న అంటూ తెల్లారేసరికి వచ్చే గంగిద్దులవారి చప్పుళ్లతో సంక్రాంతి పండుగ కొత్త కాంతిని సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ విశిష్టత పై ‘టీ న్యూస్’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
సంబురాలు సంక్రాంతి
సంక్రాంతి అంటే ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేశాధి, ద్వాదశ రాశులందూ క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి మొదలవుతుంది. ఏడాదికి 12 సంక్రాంతులుంటే కాగా పుష్యమాసంలో, హేమంతరుతువులో చల్లటి గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగుపెడతాడు. అందుకే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని చెబుతుంటారు. ఈ ఉత్తరాయణ కాలం నుంచి చేయు దానాలను ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, దుంపలు,కాయగూరలు, పండ్లు మొదలైనవి ఈ కాలమందు చేయు దానాల వల్ల స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు.
గంగిద్దుల సందడి.......
తెల్లారే సరికి ఇళ్ల ముందు హరిదాసు కీర్తనలు వినిపిస్తుంటాయి. గంగిద్దులను ఆడించే అలంకరించిన గంగిద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు,సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటిచేత నృత్యాలు చేయిస్తుంటారు. అయ్యవారికి దణ్ణం పెట్టు...అమ్మవారికి దణ్ణం పెట్టంటూ గంగిద్దుల వారి సందడి ఎంతో రమణీయంగా ఉంటుంది. పండించిన పంట సంక్రాంతికి ముందే రావడంతో ఆ ధాన్యాన్ని గంగిద్దుల వారికి దానంగా ఇస్తుంటారు.
ఆకట్టుకునే హరిదాసుల కీర్తనలు....
సంక్రాంతి పండుగ రోజు హరిలో రంగ హరి అంటూ నడి నెత్తి పై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో , కంచు గజ్జెలు గల్లుగల్లుమనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిడుతలు కొడుతూ హరిదాసులు చేసే కీర్తనలు ఎంతో ఆకట్టుకుంటాయి. తల పై అక్షయపాత్ర కదలకుండా హరిదాసులు కీర్తనలు చేస్తూ పాడటం ఎంతో బాగుంటుంది. గతంలో ఇలాంటి వేడకలుండేవి. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా హరిదాసులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
పిల్లల గాలిపటాల ఆటలు...
పండుగ రోజులో పిల్లలు, యువకులు గాలిపటాలు ఎగురేస్తుంటారు. కనువిందైన గాలిపటాలు ఎగిరేస్తూ సందడి చేస్తారు. చిన్నపిల్లలు బొమ్మరిలాటలాడుతుంటారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటుంటారు. బావమరదళ్ల సయ్యాటలు సంక్రాంతి రోజు కనిపిస్తుంటాయి.
వాకిళ్లలో వెలిసే గొబ్బెమ్మలు...
స్త్రీలు వాకిళ్లలో ముగ్గులు వేస్తుంటారు. యువతులు, ఆడపిల్లలు ఆవుపేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు వాకిళ్లల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ గొబ్బెమ్మల మీద గరకపోసలు, రంగుల పూలరేకులు పసుపు, కుంకుమలు పెడతారు.
ఇళ్లల్లో ప్రత్యేక వంటకాలు...
సంక్రాంతి పండుగ తెల్లారి జరుపుకునే కనుమ రోజు ఇళ్లల్లో ప్రత్యేకమైన పిండి వంటకాలు తయారు చేసుకుంటారు. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా భోజనాలు తయారు చేసుకొని తింటారు. కనుమ రోజంతా కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుంటారు. ఇలా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
0 comments:
Post a Comment