చేనేత రుణమాఫీకి వడ్డీల మోత!
-మాఫీ ప్రకటించి రెండేళ్లయినా
- పూర్తి నిధులు విడుదల చేయని ప్రభుత్వం
- రూ.312 కోట్లలో విడుదలైంది 114 కోట్లే
- వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అంటున్న బ్యాంకులు
హైదరాబాద్, జనవరి 21( ): పాత రుణాలు మాఫీ కావు.. కొత్త రుణాలు అందవు.. వడ్డీల మోతతో బ్యాంకుల హుకూం.. సర్కారు నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులివి. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రుణమాఫీ చేస్తున్నామని 2009లో ప్రకటించిన ప్రభుత్వం రెండేళ్లయినా ఆ నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. మూడో వంతు నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇదిలాఉండగా ప్రభుత్వం విడుదల చేసే అసలు సొమ్ముతోపాటు వడ్డీ కూడా చెల్లిస్తేనే రుణాల్ని మాఫీ చేస్తామంటూ బ్యాంకులు నిబంధన పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు అంద దీంతో సుమారు రెండు లక్షల మంది లబ్ధిదారుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
గొప్పగా ప్రకటించి..
చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం 2009లో ప్రకటించింది. ఈ మేరకు 2008, మార్చి నెలాఖరు నాటికి ప్రాథమిక సహకార సంఘాలు, ఆర్టిజన్ క్రెడిట్ కార్డులు, పీఎంఆర్‌వై, రాజీవ్ యువశక్తి పథకాల కింద తీసుకున్న రుణాలను (239 కోట్ల రూపాయలను) వడ్డీ కలిపి (రూ.312 కోట్లు) మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో సుమారు రెండు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం కలిగింది. అయితే రుణ మాఫీని అమలు చేయడంలో సర్కారు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. 2009-10 బడ్జెట్‌లో రూ.312 కోట్లను కేటాయించినా నిధులను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి రావడంతో నిధులను దశల వారీగా విడుదల చేస్తామని చెప్పింది.
తీరా రూ.109 కోట్లను మాత్రం విడుదల చేసింది. 2010, మార్చి నాటికే విడుదల చేయాల్సిన ఈ నిధులు 2011, ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఈ జాప్యాన్ని పట్టించుకోని బ్యాంకులు 2010, ఏప్రిల్ నుంచి వడ్డీ కట్టాలని తేల్చిచెప్పాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రుణమాఫీకి రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తం రూ.312 కోట్ల రుణమాఫీ నిధుల్లో ఇప్పటివరకు రూ.114 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసినా చేనేత బడ్జెట్‌లో పదో వంతు నిధులు కూడా విడుదల చేయకపోవడం చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఇప్పటికే 20 నెలలకు చేరిన వడ్డీ భారం
2010, ఏప్రిల్‌లో విడుదల చేసిన రూ.109 కోట్ల రుణమాఫీ నిధులకు సంబంధించి లబ్ధిదారులు 20 నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంది. మిగతా రుణ నిధులు ఎప్పుడు విడుదలవుతాయో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఒకవేళ ఈ నిధులు త్వరలోనే విడుదలైనా వడ్డీ భారం తడిసిమోపెడు కానుంది. అసలు కంటే వడ్డీ భారం అధికమయ్యే ప్రమాదమూ లేకపోలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పాత రుణాలు మాఫీ కాక ఇటు కొత్త రుణాలు అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Take By: T News
0 comments:
Post a Comment