వి‘లీనం’... అయ్యేనా ?
న్యూఢిల్లీ, : తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కావడంవల్ల కాంగ్రెస్‌కు వచ్చే లాభనష్టాలేమిటి? లాభం ఉంటే... ఆ లాభం ఏ మేరకు ఉంటుంది? విలీనం వల్ల కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందా? కేసీఆర్ బయటినుంచి మద్దతు ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అదే విలీనమై అసందర్భ వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందే కదా? అవి... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది కదా?... ఇవన్నీ రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌కు కలిగిన సందేహాలు. ఇవే సందేహాలకు ఆయన శుక్రవారం తనను కలిసిన తెలంగాణ ఎంపీల ముందు ప్రస్తావించారు.
టీఆర్‌ఎస్ విలీనంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలి సింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆజాద్ తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. అనంతరం 11.30 ప్రాంతంలో సీమాంధ్ర ఎంపీలతో విడిగా సమావేశమైనారు. ఇరు ప్రాంతాల ఎంపీలతో ఆయన టీఆర్‌ఎస్ విలీనం, కడప మాజీ ఎంపీ జగన్‌పైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్ ప్రభావం ఏ మేరకు ఉందని ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. జగన్ కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన బెంబేలు పడాల్సిన పనిలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆయన ఎన్నాళ్లు పార్టీని నడుపుతారో చూద్దాం. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూడకండి అని ఎంపీలకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అభ్యర్థులు మూడు స్థానాలను గెలవడం వెనక కాంగ్రెస్ నేత హస్తం ఉన్నదన్న అనుమానాలను వ్యక్తం చేశారని తెలిసింది. అంతకు ముందు నిర్మాణ్ భవన్‌లోని తన కార్యా లయంలో తెలంగాణ ఎంపీలతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తరువాత సీమాంధ్ర ఎంపీలతో గంటసేపు సమావేశమయ్యరు. భేటీ అనంతరం తెలంగాణ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులను ఆజాద్‌కు వివరించి లేఖను అందజేశామని తెలియజేశారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాం..: టి-ఎంపీలు
రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియప్రారంభించాలని కోరినట్లు ఎంపీలు వెల్లడించారు. ఎం పీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మందజగన్నాథం, పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్ని అవాంతరా లు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే నని, తెలంగాణ ఏర్పాటు లేదా పదవీ త్యాగం మినహా మరో తమకు మార్గం లేదని స్పష్టం చేశామని ఎంపీలు వెల్లడించారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో బలంగా ఉందని, ఉద్యమాన్ని నిలువరించ డం. కొనసాగించడం తమ చేతుల్లో లేదని, ఉద్యమాన్ని ప్రజలే స్వచ్ఛందంగా నిర్విహ స్తున్నారని తేల్చిచెప్పినట్లు ఎంపీ జగన్నాథం పేర్కొన్నారు.
ఈ వెనుకబాటు తనాన్ని భరించే శక్తి తమ కు లేదని, సీమాంధ్రులతో కలిసి ఉండే ప్రసక్తే లేద న్నారు. ఇప్పటికే సుమారు 6 వందల మంది విద్యా ర్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు బలిదానం చేశా రని ఆవేదన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మరే మడతపేచీ లేకుండా బేషరుతుగా డిసెంబర్ 9, 2009 చేసిన ప్రకటనకు కట్టుబడి వుండా లని గులాంనబీని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్య మం కారణంగా సొంత నియో జకవ ర్గాలలో పర్యటిం చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ విశ్వసనీయత కు మారుపేరని, ప్రజలు కాంగ్రెస్ ప్రభు త్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ప్రజలకు విశ్వా సం కల్గించే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
ఎంపీ సర్వే సత్యనారాణయణ మాట్లాడుతూ సోనియా గాంధీ డిసెంబర్ 9 తన జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసారని, 2011 డిసెంబర్ 9 లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సీమాంధ్రులకు అమ్ముడు పోయి ఏక పక్షంగా నివేదిక సమర్పించారని, ఆ నివేదిక సూచనలను పరిగణలోకి తీసుకోవద్దని ఆజాద్‌ను కోరి నట్లు వెల్లడించారు. తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించని కారణంగా కాంగ్రెస్ పార్టీ మండలి ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేసినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సురేష్ షేట్కార్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంద జగన్నాథం, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, రాజయ్య, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.
అభివృద్ధి గురించే చర్చించాం...
తెలంగాణ అంశం చర్చకు రాలేదు: సీమాంధ్ర ఎంపీలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశా లపై ఆజాద్‌తో చర్చించామని సీమాంధ్ర ఎంపీలు పేర్కొన్నా రు. గులాం నబీ ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన కు అభినందనలు చెప్పామని మూకుమ్మడిగా మీడియా తో అన్నారు. కేవలం రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై చర్చించామని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకుని మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కోరిన ట్లు ఎంపీలు వెల్లడించారు.
మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఎంపీలు
మీడియాతో మాట్లాడేందుకు ఏమీ లేదని, ఏదైనా సమాచారం మా సీనియర్‌నాయకుడు నేదురుమల్లి జనార్ధ న్ రెడ్డి అందిస్తారంటూ సీమాంధ్ర ఎంపీలం దరూ అక్కడ నుంచి జారుకున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పురేందేశ్వరి, సాయిప్రతాప్, పల్లం రాజులు మీడియాకు దూరంగా వెళ్లిపోయారు. ఎంపీ హర్షకుమార్ నేనేమి మాట్లాడానో మీకు తెలుసు, ఇంకా మీతో చెప్పేందుకేమీ లేదంటూ దాటవేశారు. సీమాంధ్ర ఎంపీలలో కావూరి సాంబ శివరావు, కిషోర్ చంద్రదేవ్, ఎప్‌పివై రెడ్డి, చింతా మోహన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి హాజరు కాలేదు.
రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ తప్ప మరి దేనికీ మేం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లింది. దాన్ని ఆపడం, లేదా కొనసాగించడం మా చేతుల్లో లేదు
- పొన్నం ప్రభాకర్
0 comments:
Post a Comment