ఆంధ్రా ఉద్యోగులను అడ్డుకోండి
అసెంబ్లీలోని తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ పిలుపు
ఉద్యోగులపై ఈగ వాలనివ్వం
అధికారుల భరతం పట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు
ప్రతి జిల్లాకు 500 మంది పార్టీ సైనికులు
ఉద్యమ ఉద్యోగులను సమరయోధులుగా గుర్తిస్తాం
రాష్ట్రం వచ్చాక పదోన్నతులు.. కేంద్ర ప్రభుత్వ పేస్కేళ్లు
ఉద్యోగుల సహకారం లేకుండా శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎలా నిర్వహిస్తారో చూద్దాం'' అని శాసనసభలోని తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం జరగనున్న సహాయ నిరాకరణకు సహకరించాలని అభ్యర్థిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, కె.శ్రీనివాసగౌడ్, సి.విఠల్ నేతృత్వంలో పలు సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్‌ను కలిశారు.
అలాగే, నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు, పీఆర్‌టీయూ నేత రవికిరణ్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణపై శాసనసభను స్తంభింపజేస్తామని, తాను పార్లమెంటులో స్పీకర్ పోడియం వద్ద కూర్చుంటానని చెప్పారు. ఇక తాడో పేడో తేల్చుకుంటామని, నూరు శాతం విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.
ఈనెల 17 నుంచి పాలనను స్తంభింపజేస్తామని ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయని, సహాయ నిరాకరణలో పాల్గొనే ఉద్యోగులపై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తిస్తే పెన్‌డౌన్ సమ్మె చేయాలని జేఏసీలోని సంఘాలు నిర్ణయించాయని చెప్పారు. "ఉద్యోగులకు ఎటువంటి భయమూ అవసరం లేదు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఈగ వాలనియ్యం. వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది.
ఉద్యోగులను వేధిస్తే, వారిపై ఎస్మా ప్రయోగిస్తే 60 వేల మంది కార్యకర్తలతో నేనే మళ్లీ 'ఆమరణ నిరాహార దీక్ష' చేపడతా. ఏ ఒక్క ఉద్యోగినైనా అరెస్టు చేసినా, వేధించినట్లు తెలిసినా... తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ మరుక్షణమే 'మెరుపు దీక్ష'ను మొదలుపెడతా. ప్రభుత్వం మెడలు వంచుతా. ఉద్యోగులను అరెస్టు చేసినా, వేధించినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. అత్యవసర సర్వీసులనూ స్తంభింపజేద్దాం. రాష్ట్రం మొత్తం స్తంభించిపోతుంది'' అని కేసీఆర్ హెచ్చరించారు.
తమ జీతాలు, డిమాండ్ల కోసం కాకుండా ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని, చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. గతంలో జరిగిన ఉద్యమం సందర్భంగా ఆమోస్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించారని, ఈసారి అటువంటి సంఘటనలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "కార్యాలయాల్లో మీరు, బయట మేము సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వం ఎలా దిగి రాదో చూద్దాం'' అని పిలుపునిచ్చారు.
ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులను వేధించే అధికారుల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా 'టాస్క్‌ఫోర్స్' బృందాలను, జిల్లాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఉస్మానియా విద్యార్థులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, సభ్యులు టాస్క్‌ఫోర్స్‌ల్లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరితోపాటు స్థానికంగా కూడా ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటవుతాయని తెలిపారు.
ఉద్యోగులపై వేధింపులు ప్రారంభమైతే ఈ 'టాస్క్‌ఫోర్స్' బృందాలు రంగంలోకి దిగుతాయని, ప్రతి జిల్లాకు 500 మంది సుశిక్షితులైన పార్టీ సైనికులను పంపుతామని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంతోపాటు ఆ తర్వాత జరగాల్సిన పునర్నిర్మాణంలో కూడా ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామని, రాష్ట్ర సాధన తర్వాత వారికి పదోన్నతులు ఇవ్వడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేళ్లను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగులకు సంఘీభావంగా ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. "తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. ఒక్క హైదరాబాద్ నగరంపైనే కిరికిరి పెడుతోంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. మనం కూడా ఇప్పుడే గట్టిగా ఉండాలి. కార్యాలయాల్లో మీరు, బయట మేము ఉద్యమిద్దాం'' అని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు తెలంగాణ రాష్ట్రం రూ.63 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండేదని, ఇప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్‌లో 70 శాతానికిపైగా నిధులు ఈ ప్రాంతం నుంచే వస్తున్నాయని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రంలో గిరిజనులు 11 శాతంగా ఉంటారని, దాంతో, వారికి రాజకీయ ప్రాతినిథ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. పీజీలు, బీఈడీలు చేసి టీచర్లు అయిన వారిని అప్రెంటిస్ పేరిట ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందని, వెట్టి చాకిరీ చేయించుకుంటోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. 2008 డీఎస్సీలో ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తాను ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నానని, అప్పటికీ స్పందించకపోతే మిత్రులను కలుపుకొని ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ప్రభుత్వానిదే బాధ్యత: జేఏసీ నేతలు
తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో సీమాంధ్ర, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అధికారులతో విధులను నిర్వర్తింపజేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జేఏసీ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాదరావు, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ ఆరోపించారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు.
ఎలాగైనా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలని, తద్వారా, శాంతిభద్రతలను సాకుగా చూపి ఉద్యోగులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. వారితోపాటు ఉద్యోగ సంఘాల నేతలు సయ్యద్ సలీముద్దీన్, ఎంబీ కృష్ణయాదవ్, జేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి తదితరులు కేసీఆర్‌ని కలిశారు.
తెలంగాణ భవన్ వద్ద అమరవీరుల ఐక్యవేదిక కార్యకర్తల నినాదాలు
అమరవీరుల ఐక్యవేదిక కార్యకర్తల నినాదాలు, వాటికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో తెలంగాణ భవన్ వద్ద ఆదివారం కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరవీరుల కుటుంబాలకు చెల్లని చెక్కులు ఇచ్చారని, అమర వీరులను అడ్డు పెట్టుకుని కేసీఆర్ కుటుంబం సంపాదించుకుంటోందని ఐక్యవేదికకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద నినాదాలు ఇచ్చారు. వారికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలూ నినాదాలు చేశారు. ఆ తర్వాత కొంత దూరం వారిని తరిమికొట్టారు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
take BY: AndhraJyothi
1 comments:
Post a Comment