కాటన్ వారసత్వంలో గోదావరి!
కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి.
ఈ అంశాలపై ఆయా దేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
‘కాటన్ దొరస్నానమహం కరిష్యే కాటన్ దొరస్నాన మహం కరిష్యే’- సర్ ఆర్థర్ కాటన్ సజీవులుగా ఉన్నప్పుడే గోదావరి తీరాన వేదవేత్తలు రేవుల్లో స్నానం చేసేముందు చెప్పుకొనే సంకల్పంలో ఆయన్ని ఆ విధంగా స్మరించుకొనేవారు. వారి దృష్టిలో కాటన్ సాక్షాత్తు భగీరథుడే. ఆయన్ని గురించి కోస్తాంధ్ర ప్రజల అభిప్రాయం ఇప్పటికే అదే. రైతులు, ఇంజనీర్లు, టెక్నోక్రాట్స్ ప్రతి ఒక్కరూ ఆ పరదేశీని అత్యంత గౌరవంగా స్మరించుకోవడం కద్దు.
1852లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట (ఇప్పుడు కాటన్ బ్యారేజ్‌గా సుప్రసిద్ధం) నిర్మాణాన్ని పూర్తిచేసినప్పుడు ఆయన దాన్ని కేవలం ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ గా మాత్రమే భావించలేదు. ఒక ‘క్రైస్తవ ప్రభుత్వం’ తన పాలనలోని వారికి అందించే సేవలకు ఒక తార్కాణంగా గోదావరి ఆనకట్టను కాటన్ భావించారు.
ఒక క్రైస్తవ ప్రభుత్వం అందించే సేవలపై దేశీయులు అంటే పాలితులకు పూర్తిగా కొత్త భావాలు కల్గించి తద్వారా వారిని క్రైస్తవ మత స్వీకారానికి ఉన్ముఖులను చేయడమే అసలు లక్ష్యమని కాటన్ స్వయంగా పేర్కొన్నారు.
మనం విదేశీ పాలన నుంచి విముక్తి పొంది ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా మనలో ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలనా కాలపు సంప్రదాయాలు, ఆలోచనారీతులే కొనసాగుతున్నాయి. 1856లో నదీ జలాల విషయమై కాటన్ ఏమన్నారో చూడండి: ‘నది స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ప్రధాన ప్రవాహిని, దానిలో కలిసే ఉపనదులూ పొంగిపొరలి తీర ప్రాంతాలను ముంచెత్తకుండా కృత్రిమ అడ్డుకట్టలు నిర్మించాలి. కృత్రిమ పద్ధతుల ద్వారానే నదిలో ప్రవాహం నిరంతరమూ ఒక స్థాయిలో ప్రవహించి, పరీవాహక ప్రాంతాలకు ఉపయోగపడేలా చూడడం, అలాగే ఆ నీరు కాలవల వ్యవస్థద్వారా ప్రతి ఎకరానికి అందేలా చేయడం కూడా ఎంతో ముఖ్యం’.
ఆయన ఇంకా ఇలా రాశారు: ‘గోదావరి డెల్టాలో జరుగుతున్న నీటి పారుదల వ్యవస్థ నిర్మాణం నాలుగు లక్ష్యాలతో జరుగుతుంది. అవి
నదిని నియంత్రించడం,
తీర భూములను వరదల నుంచి పరిరక్షించడం,
పరీవాహక ప్రాంత భూములకు నిరంతరం నీటి సదుపాయం కల్గించడం,
చౌక రవాణా మార్గంగా నదీ వ్యవస్థను ఉపయోగించుకోవడం.
మనం ఇప్పుడు పర్యావరణ (సహజ) ప్రవాహంగా పరిగణించే దానికి ప్రతిబంధకం కల్గించడమే నీటి పారుదల వ్యవస్థలపై కాటన్ దార్శనికతలోని ప్రధాన అంశం. దీనితో పాటు గరిష్ఠ స్థాయిలో లాభాలను సాధించడానికి నదీజలాలు, వాటి పారుదల వ్యవస్థలను ఆర్థికంగా ఉపయోగించుకోవడం మరో ప్రధాన లక్ష్యం. కాటన్ లక్ష్యంగా పెట్టుకున్న నిరంతర నీటి సరఫరా సాంప్రదాయక పంటల సాగు పద్ధతులు, నీటి సరఫరా విధానాలను అనివార్యంగా మార్చివేస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంపొందించడానికినిరంతర నీటి సరఫరా ఒక భద్రమైన మార్గంగా ఆయన భావించారు.
వ్యవసాయ భూములను నిరంతరం సాగుచేయకుండా అప్పుడప్పుడూ కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి పంటలు వేయకుండా ఖాళీగా ఉంచడమనే సంప్రదాయ సేద్య విధానం బ్రిటిష్ వారికి ఏ మాత్రం నచ్చలేదు. దానివల్ల ప్రభుత్వ కోశానికి శిస్తు రూపేణా రావాల్సిన రాబడి కొరవడుతుందని వారు ఆందోళన చెందారు. గ్లాస్‌ఫర్డ్ అనే అధికారి ఇలా రాశారు ‘ప్రతి ఖరీఫ్ సీజన్‌లోను 2000 నాగళ్ళు అటక మీదే ఉండిపోతున్నాయి.
వాటితో 8000 ఎకరాలను సాగుచేయవచ్చు. ఆ భూములకు నిరంతర నీటి సరఫరా కలుగజేస్తే విరామం లేని వ్యవసాయం సాధ్యమవుతుంది’. కేవలం వరదలను అరికట్టి దేశీయులకు తోడ్పడడమే గోదావరిపై ఆనకట్ట నిర్మాణ లక్ష్యం కాదు. ఆ నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి నయా పైసాను నీటి తీరువా ద్వారా తిరిగి రాబట్టుకోవడం జరిగింది. 1878లో గోదావరి, కృష్ణా (అప్పుడు కిస్ట్నా అనేవారు) డెల్టాలలో నీటి తీరువా సారవా (ఖరీఫ్) పంటకు ఎకరానికి నాలుగు రూపాయలుగా ఉండేది (తరువాత దీనిని 5 రూపాయలకు పెంచారు). దాళవా (రబీ) పంటకు నీటితీరువా ఎకరానికి ఆరు రూపాయలుగా ఉండేది. మెట్ట పంట విషయానికి వస్తే ఈ శిస్తు ఎకరానికి రెండు రూపాయలుగా ఉండేది.
ఆనకట్ట నిర్మాణం బ్రిటిష్ వలస పాలకులకు ఆర్థికంగా ఎంతో లబ్ధిని సమకూర్చింది. సాగునీటి సదుపాయాల వృద్ధిద్వారా వచ్చిన లబ్ధే కాదు అంతర్గత జల రవాణా సదుపాయాల వ్యవస్థకూడా ఇతోధికంగా మెరుగుపడింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో జల రవాణా వ్యవస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని కాటన్ ప్రతిపాదించారు. అయితే ఈ విషయమై బ్రిటిష్ పాలకులు తగు శ్రద్ధ చూపకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నూట యాభై సంవత్సరాల అనంతరం కాటన్ కలలు సాకారమవుతున్నాయి! గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన వివిధ ప్రాజెక్టులతో ఆ నదీ జలాలను చుక్క కూడా విడవకుండా ఉపయోగించుకోవడానికి ప్రస్తుత పాలకులు పూనుకున్నారు (అయితే ఇది నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమేనా? పర్యావరణ భద్రతనైనా పట్టించుకుంటున్నారా? సమాధానాలు స్పష్టమే).
ప్రజల సొమ్ముతో అభివృద్ధిపరచిన సదుపాయాలను ప్రైవేట్ లబ్ధికి వినియోగించుకోవడమనే ఆయన స్వప్నం కూడా నిజమవుతోంది. వాణిజ్య పర్యాటక సదుపాయాల అభివృద్ధే ఇందుకొక నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం “గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ, సుజల స్రవంతితో సహా ఐదు ప్రాజెక్టులకు ‘జాతీయ’ హోదాను సాధించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని” ప్రకటించడం గమనార్హం.
గోదావరి నదిపై ప్రాజెక్టులకు 18,000 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో 4000 కోట్ల రూపాయలను పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వినియోగించారు. నిజానికి పోలవరం విషయంలో గానీ, గోదావరిపై నిర్మిస్తున్న మరే ఇతర ప్రాజెక్టు విషయంలో గానీ ఎన్నికలకు ముందు పెద్దగా ఆసక్తి వ్యక్తం కాలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎన్నికల ప్రచారంలో కూడా అవి చర్చనీయాంశాలు కాలేదు.
కోస్తాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న ఒక దశలో తెలంగాణ రాష్ట్రాన్ని అనుమతిస్తే గోదావరి జలాలు తీరాంధ్రులకు అందుబాటులో ఉండవని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది! ‘గోదావరి జలాల వినియోగం’అనే నినాదాన్ని 2004 ఎన్నికలలో మాదిరిగా 2009 ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. మొత్తంగా జలవనరుల వ్యవహారాలు సైతం ప్రస్తుత ఎన్నికలలో కంటే గత అసెంబ్లీ ఎన్నికలలోనే నిర్ణయాత్మక పాత్ర వహించాయి. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆర్. విద్యాసాగరరావు ఇలా అన్నారు: ‘సాగునీటి వనరుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకించడం లేదు. అయితే ఆ ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్‌ను మాత్రమే వ్యతిరేకిస్తుంది. అంత భారీ ప్రాజెక్టుకు బదులుగా చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మిస్తేనే ప్రజలకు ఎక్కువ సహాయకారిగా ఉంటుంది. నిర్వాసితుల సమస్య కూడా ఉత్పన్నం కాబోదు’.
ఇక ఇప్పుడు గోదావరిపై ప్రాజెక్టులను పునః సమీక్షించే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రసమితి, వామపక్షాలు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాయి. శాసనసభలో వాటిని వ్యతిరేకించేవారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఎవరైనా అభ్యంతరం చెప్పినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోదు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగితే సామాజికంగా, పర్యావరణ పరంగా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ అంశాల గురించి శాసనసభ వెలుపల బాగానే చర్చలు జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు మెజారిటీ లభించడంతో అసెంబ్లీలో ఆ అంశాలపై చర్చలు జరిగే అవకాశం లేదు.
ఇతర పార్టీలుసైతం ఈ అంశాలపై చెప్పుకోదగిన శ్రద్ధ చూపవు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరాగమనంతో గోదావరి జలాల నియంత్రణ, వాటి ప్రైవేటీకరణ మరింత వేగవంతమవనున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, నిర్వాసితుల పునరావాసం, ప్రకృతిని మానవ అవసరాలకు అనుగుణంగా నియంత్రించడం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఆయాదేశాల పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర నిరసన పెల్లుబుకుతోంది. అయినప్పటికీ మన రాష్ట్రంలో కాటన్ వారసత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అధిక లాభాల కోసం ప్రకృతి వనరులను మితిమీరి వినియోగించుకొనే తీరు కొనసాగినంత వరకు నదీ జలాలు, మరే ఇతర సహజ వనరులకు సంబంధించి అయినా ప్రజల ఆందోళనకు ఉపశమనం లభించదు.
0 comments:
Post a Comment